ట్రంప్ తో గొడవ.. కొత్త పార్టీ దిశగా ఎలన్ మస్క్?

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో "కొత్త రాజకీయ పార్టీని పెట్టే సమయం ఆసన్నమైందా...?" అంటూ ఒక పోల్ పెట్టారు.;

Update: 2025-06-06 15:06 GMT

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో "కొత్త రాజకీయ పార్టీని పెట్టే సమయం ఆసన్నమైందా...?" అంటూ ఒక పోల్ పెట్టారు. ఈ పోల్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య మద్దతు లభించింది. పోల్‌లో పాల్గొన్న వారిలో 81% మంది మస్క్ కొత్త పార్టీని ప్రారంభించాలని మద్దతు పలకగా.., 19% మంది మాత్రం వద్దని సూచించారు. ఈ పోల్‌కు 41 లక్షలకు పైగా ఓట్లు, ఐదు కోట్లకు పైగా వీక్షణలు లభించాయి. ఇది అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

-ట్రంప్‌తో పెరుగుతున్న విభేదాలు

ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య విభేదాలు ఇటీవల కాలంలో మరింత పెరిగాయి. ఇరువురు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ట్రంప్‌పై మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. "పెద్ద బాంబు లాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్టడం లేదు" అంటూ మస్క్ ఒక పోస్ట్ చేశారు. "బిగ్ బ్యూటిఫుల్ బిల్" వ్యవహారంలో మస్క్ తీరుతో తాను విసిగిపోయానని ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన కొన్ని గంటల్లోనే మస్క్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.

కాగా, గతంలో డోజ్ (DOJ) శాఖ నుంచి ఎలాన్ మస్క్ వైదొలిగిన తర్వాత తన వల్లే ట్రంప్ గెలిచారని వ్యాఖ్యానించారు. దీనికి బదులిస్తూ ట్రంప్ "ఆయన లేకున్నా నేను గెలిచేవాడిని" అని కౌంటర్ ఇచ్చారు. ఈ విధంగా ట్రంప్, మస్క్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో, ట్రంప్‌కు వ్యతిరేకంగా కొత్త రాజకీయ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

- నెటిజన్ల అభిప్రాయాలు

మస్క్ పోల్‌పై నెటిజన్లు పెద్ద సంఖ్యలో కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొందరు లిబర్టేరియన్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మస్క్‌కు సూచనలు చేయగా.. మరికొందరు అలా చేస్తే ఓట్లు చీలి డెమోక్రాట్లే గెలుస్తారని వాదిస్తున్నారు.

మొత్తానికి ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పెట్టిన ఈ పోల్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, మస్క్ ఈ పోల్ ఆధారంగా కొత్త రాజకీయ పార్టీని దూకుడుగా ప్రారంభించేందుకు ముందుకెళ్తాడా, లేదంటే లిబర్టేరియన్ పార్టీకి మద్దతు ఇస్తాడా, లేదా మళ్లీ ట్రంప్‌తో కలిసి ముందుకెళ్తాడా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News