పేరు.. ’అమెరికా పార్టీ’.. కానీ, మస్క్ అమెరికా ప్రెసిడెంట్ అవగలరా?
అన్నంత పని చేసి.. పెద్దన్నలాంటి ట్రంప్ నకు ఝలక్ ఇచ్చి మస్క్ మామ కొత్త పార్టీ స్థాపించేశారు.;
అన్నంత పని చేసి.. పెద్దన్నలాంటి ట్రంప్ నకు ఝలక్ ఇచ్చి మస్క్ మామ కొత్త పార్టీ స్థాపించేశారు. అసలు అమెరికా అంటే రెండు పార్టీల వ్యవస్థ. అయితే, డెమోక్రాట్లు.. లేదంటే రిపబ్లికన్లు.. ఈ రెండు పార్టీల నుంచే మనం చూసిన అధ్యక్షులు వచ్చారు. ఇలాంటి దేశంలో మూడోపార్టీకి అవకాశమే లేదు అన్నట్లు పరిస్థితులు కనిపిస్తుంటాయి. కానీ, మస్క్ మాత్రం అలాంటి ఇలాంటి వాడు కాదుగా..? అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించే రకం. అందుకే ’అమెరికా పార్టీ’ అంటూ ఆ దేశం పేరిటే పార్టీని స్థాపించేశారు.
ఒకవైపు దశాబ్దాలుగా అమెరికాను ఏలుతున్న రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలను తట్టుకుని మస్క్ అమెరికా అధ్యక్షుడు కాగలరా..? అపర కుబేరుడు కావడంతో డబ్బుకు లోటు లేదు అని చెప్పొచ్చు. కానీ, అదొక్కటే సరిపోదు కదా...? అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని చెబుతున్న మస్క్.. తాను తీసుకొచ్చే మార్పులు ఏమిటి? స్వేచ్ఛకు మారుపేరు అయిన అమెరికాలో స్వేచ్ఛ తీసుకొస్తానని చెబుతున్న మస్క్ ఏం చేస్తారు? బిగ్ బ్యూటీఫుల్ బిల్లు ఆమోదంతోనే మస్క్ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. కానీ, అదే ఊపు ఇంకా కొనసాగిస్తారా? అనేది చూడాలి.
సొంత సామాజిక మాధ్యమం ఎక్స్ లో గతంలో మస్క్ కొత్త పార్టీపై పోల్ నిర్వహించగా 80 శాతం మంది గో ఎహెడ్ అని రిప్లయ్ ఇచ్చారు. చివరకు తను చెప్పినట్లే చేశారు మస్క్.
పార్టీకే అధ్యక్షడు.. దేశానికి కాలేరు..
తన పెద్దన్న ట్రంప్ ను విభేదించి.. మస్క్ సొంతంగా పార్టీ పెట్టినా.. ఆయన మాత్రం అమెరికా అధ్యక్షుడు కాలేరు. జన్మత: అమెరికాలో పుట్టినవారే ఆ దేశానికి అధ్యక్షులు అయ్యేందుకు అర్హులు. మస్క్ మాత్రం దక్షిణాఫ్రికాలో పుట్టారు. ఈ కోణంలో చూస్తే మస్క్ అమెరికాకు అధ్యక్షుడు కాలేరు. కేవలం తన పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాగలరు. అయితే, తన విధానాలతో ప్రజల మనసును గెలుచుకుని.. వేరొక నాయకుడిని అధ్యక్ష అభ్యర్థిగా నిలపవచ్చు.