ఎన్నికల సంస్కరణలకు ఇదే సరైన సమయం !
మన దేశంలో ఎన్నికలు చాలా కీలకమైనవి. అయితే ఎన్నికల విధానంలో ఇంకా మార్పులు చేపట్టాల్సి ఉంది.
మన దేశంలో ఎన్నికలు చాలా కీలకమైనవి. అయితే ఎన్నికల విధానంలో ఇంకా మార్పులు చేపట్టాల్సి ఉంది. ఇది అనేక సందర్భాలలో మేధావులు ఆలోచనాపరుల నుంచి వస్తున్న మాట. ముఖ్యంగా ఎన్నికల విధానంలో కీలక మార్పులు చేయాల్సి ఉంది. ముందుగా ఓటరు కార్డుతో ఆధార్ కార్డుని అను సంధానం చేయాల్సి ఉంది.
అలాగే ఎవరు ఎక్కడ ఉన్నా వారు అక్కడే ఓటును నమోదు చేసుకుని స్థానికంగా వేయడం మంచి విధానం. లేదా వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ విధానం లాంటిది అమలు చేయడంలో కాస్తా ముందుగా వారు ఉన్న చోట్ల ఓటింగ్ ఫెసిలిటేటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించడమో చేస్తే చాలా వ్యయ ప్రయాసలు తప్పుతాయి. మరి ఒక సంస్కరణగా కూడా ఇవన్నీ చూడాల్సి ఉంది.
ఉద్యోగ ఉపాధి కోసం ఎక్కడికో వెళ్ళిన వారు పోలింగ్ రోజున తమ సొంతూళ్ళకు రావాలని పడుతున్న తాపత్రయం ఒక ఎత్తు అయితే వారు ఎంత దూరాభారం నుంచి వస్తూ పోలింగ్ లో గంటల సేపు క్యూ కట్టడం అన్నది మరో ఎత్తు. ఇవన్నీ చక్కదిద్దేందుకు ఏమైనా సంస్కరణలు చేపట్టాలని కోరుతున్న వారూ ఉన్నారు.
ఇక అతి ముఖ్యమైన సంస్కరణ ఏంటి అంటే ఏ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అక్కడే పోటీ చేసేలా చూడడం. ఎందుకు అంటే స్థానికంగా ఉండేవారికే ఆయా సమస్యలు తెలుస్తాయి. వారు స్థానికంగా ఉంటేనే జనాలకు అందుబాటులో ఉంటారు. అలా కాకుండా కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా ఎంపీ అభ్యర్ధి ఎక్కడైనా పోటీ చేయవచ్చు అంటే అది అవకాశంగా ఇచ్చినా తీరా అలా దిగి వచ్చిన పారాచూట్ నేతలు ఏ మేరకు తాము పోటీ చేసే చోట న్యాయం చేస్తారు అన్నది కీలకమైన ప్రశ్న. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పోటీ చేయాల్సిన చోట కనీసంగా అయిదేళ్ళ పాటు నివాసం ఉంటూ స్థానికత సంపాదించేలా ఉంటేనే ఆ తరువాత ఎన్నికల్లో పోటీకి చాన్స్ ఇవ్వాల్సి ఉంది.
అలాగే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ. మరి ఒక ఎమ్మెల్యే అభ్యర్ధి టోటల్ ఎన్నికల ఖర్చు నలభై లక్షలు మాత్రమే ఉంటే పోలింగ్ కి ముందు రోజు పంచుడు కార్యక్రమానికే కోట్లలో ఖర్చు అవుతోంది. ఈ మధ్యలో ఎన్నికల ప్రచారానికి కూడా కోట్లలో ఖర్చు. మరి ఇలా మితిమీరిన ఖర్చులతో సామాన్యుడు అంతకంతకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్న నేపధ్యం ఉంది.
అందువల్ల ప్రభుత్వమే పోటీ చేస్తున్న అభ్యర్ధుల మొత్తం ఖర్చుని భరించేలా సంస్కరణను తీసుకుని రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్నికల్లో అభ్యర్ధులు కానీ పార్టీలు కానీ విడుదల చేసే ఎన్నికల ప్రణాళికలు అన్నీ ఎన్నికల సంఘం వద్ద ఉంచాలి. వాటిని ఏ విధంగా తాము పూర్తి చేస్తామో చెప్పగలగాలి. లేకపోతే గాలి హామీలతో ఆయా పార్టీలు గెలిచిన పిమ్మట ఓటర్లకు టోపీలు పెట్టే పరిస్థితి ఏర్పడుతోంది.
అదే విధంగా ఎన్నికల ప్రణాళికను అమలు చేయలేని వారికి ఈసీ కఠిన శిక్షలు విధించడం ద్వారా ఒక టెర్మ్ ఆయా పార్టీలను ఎన్నికల గోదాలోకి దిగకుండా కట్టడి చేయాల్సి ఉంది. అలాగే అభ్యర్ధుల నాయకుల తిట్ల పురాణాల మీద కూడా పూర్తి నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. ఆధారాలు లేని ఆరోపణలు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక ఎన్నికల వేళ మీడియాను పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయించే వారి సభ్యత్వాన్ని ఎన్నికల సంఘమే నేరుగా రద్దు చేసే అధికారాన్ని కూడా అంది పుచ్చుకోవాలని కోరుతున్నారు. భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. గత ఏడు దశాబ్దాలుగా ఎన్నికల పండుగ సాగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఎన్నికలు కనుక సక్రమంగా నిర్వహించాలంటే మరింత కట్టుదిట్టంగా నిబంధనలు అమలు చేయాలి. అపుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అన్నది అందరి మాటగా ఉంది.