ఎల్ నినో టాటా బై బై చెప్పేసిందా...నిజమిదేనా ?
అల్ప పీడనాలు బాబోయ్ అనుకునేవారు నిన్నటిదాకా. కానీ ఇపుడు అవే ఊపిరి పోస్తున్నాయి. వానలు ఆ మాత్రం పడుతున్నాయంటే వాటి వల్లనే అని అంటున్నారు.
అల్ప పీడనాలు బాబోయ్ అనుకునేవారు నిన్నటిదాకా. కానీ ఇపుడు అవే ఊపిరి పోస్తున్నాయి. వానలు ఆ మాత్రం పడుతున్నాయంటే వాటి వల్లనే అని అంటున్నారు. ఒక వైపు ఎల్ నినో ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాటుగా ఎక్కడ చూసినా భూగర్భ జలాలు ఇంకిపోయాయి, చెరువులు రిజర్వాయర్లు ఇతర నీటి వనరులలో నీరు తగ్గిపోయింది. ఎలా బతికేది దేవుడా అని అంతా ఆందోళన చెందుతున్న సమయంలో అల్ప పీడనాలు వరసబెట్టి వస్తున్నాయి. వాటి వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మరి ఎల్ నినో సంగతేంటి టాటా బై బై చెప్పేసిందా అన్న చర్చ సాగుతోంది.
ఈ వానలు ఎక్కడ నుంచి :
ఇదిలా ఉంటే అసలు వాస్తవం వాతావరణ నిపుణులు చల్లగా ఎల్ నినో సాక్షిగా చెబుతున్నారు. ఇది ఎల్ నినో ఉన్నా కూడా అల్పపీడనాలు ఎంతో కొంత కరుణించి కురుస్తున్న వానలుగానే చెబుతున్నారు. దేశంలో ఏకంగా పన్నెండు రాష్ట్రాలలో ఎల్ నినో ప్రభావం ఉంది. అందులో రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణా కూడా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో సైతం ఎల్ నినో ప్రభావం పూర్తిగా ఎక్కడా తగ్గలేదు అన్నది వాతావరణ నిపుణుల క్లారిటీగా ఉంది. అయితే అల్పపీడనాల కారణంగా కొన్ని ప్రాంతాలలో తాత్కాలికంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇది ఎంతో కొంత ఊరట మాత్రమే అని అంటున్నారు. అంతే కాదు రాబోయే నెలలలో మరింతగా వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎల్ నినో ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాల ప్రభావం మందగించడం వల్ల అక్కడక్కడ వర్షపాతంలో తీవ్ర లోటు నమోదైంది. దాంతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయం అయితే బాగా ఇబ్బందులో పడింది.
కాస్తా ఊరట మాత్రమే :
ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు మేఘాల కదలికల వల్ల తాత్కాలికంగా వర్షాలు కురిసినా, పూర్తి స్థాయి వర్షపాతంపై ఎల్ నినో ప్రభావం ఇంకా కొనసాగుతోంది అన్నది వాతావరణ నిపుణుల కచ్చితమైన మాట. అందుకే ప్రత్యామ్నాయ పంటల వైపే మొగ్గు చూపాలని రైతులకు సూచిస్తున్నారు. ఈ వానలను చూసి ఆశపడకుండా వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరుతున్నారు. ఇక రెండు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కూడా ఇదే విషయం మీద రైతులను అప్రమత్తం చేస్తున్నాయి.
భారీగా ప్రభావం :
నిజం చెప్పాలీ అంటే తెలుగు రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంది. తెలంగాణలో 27 శాతం వర్షపాతం లోటు నమోదు కాగా ఈ ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ , ఇన్‌కాయిస్ హెచ్చరిస్తున్నాయి. తెలంగాణలోని వేలాది రెవెన్యూ గ్రామాలలో వర్షాలు లేక వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. కేవలం కొన్ని జిల్లాలలోనే సాధారణ వర్షపాతం నమోదైంది అలాగే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వర్షాకాలంలోనూ ఎండల తీవ్రత కనిపిస్తోంది. వర్షాలపై ఆధారపడిన పంటలకు సాగునీటి సమస్య ఏర్పడుతోంది. దాంతో రైతులు అంతా ఎల్ నినో ఇంకా ఉందని భావించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు కోరుతున్నారు.
చంద్రబాబు సమీక్ష :
మరో వైపు చూస్తే ఏపీలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్న మండలాల్లో బోరు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని అధికారులు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై ఆయన సమీక్ష నిర్వహించారు. జూలై నెలలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రానున్న మూడు నెలల్లో సరాసరి 35 నుంచి 40 శాత మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు కృష్ణా, గోదావరి బేసిన్ లో ఎగువ రాష్ట్రాల నుంచి జలాలు వచ్చే అవకాశాలను ముఖ్యమంత్రి ఈ సందర్భం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే రాబోయే నాలుగు నెలల పాటు ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారని రైతులకు చెబుతోంది. తెలిపారు. రైతులు కొత్తగా బోర్లు వేయకుండా, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. వర్షపాతానికి అనుకూలమైన పంటలు, ముఖ్యంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతోంది.