ఈ దారి..డిజిటల్‌ రహదారి..తప్పు చేస్తే తప్పదు మూల్యం..దేశంలో తొలి హైవే

దీనినే ఓ జాతీయ రహదారికి వర్తింపజేస్తే ఈ దారి.. డిజిటల్‌ రహదారి.. తప్పుచేస్తే తప్పదు మూల్యం అని చదువుకోవాలి;

Update: 2025-06-29 04:19 GMT
ఈ దారి..డిజిటల్‌ రహదారి..తప్పు చేస్తే తప్పదు మూల్యం..దేశంలో తొలి హైవే

నా దారి రహదారి..డోంట్‌ కమ్‌ ఇన్‌ మై వే.. అన్నది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫేమస్‌ డైలాగ్‌. దీనినే ఓ జాతీయ రహదారికి వర్తింపజేస్తే ఈ దారి.. డిజిటల్‌ రహదారి.. తప్పుచేస్తే తప్పదు మూల్యం అని చదువుకోవాలి. ఇలాంటి ఓ నేషనల్‌ హైవే దేశంలోనే మొదటిది కావడం విశేషం. మనం విదేశాల్లోని రహదారుల ప్రత్యేకత గురించి నేరుగా చూసి ఉండడమో.. చదివి ఉండడమో.. సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుని ఉండడమో చేసి ఉంటాం.. అలాంటి రోడ్డు మనదగ్గర ఎప్పుడు? అని ఆలోచించి కూడా ఉంటాం. ఎందుకంటే నిర్దేశిత వేగం నియంత్రణ దాటితే ఫైన్లు ఆటోమేటిక్‌గా పడడం..పోలీస్‌ ను అలర్ట్‌ చేయడం.. ప్రమాదాలపై సమాచారం ఇవ్వడం.. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతుందని తెలుసు. అలాంటిదే భారత దేశంలోనూ ఓచోట ఉండబోతోంది.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక, నితిన్‌ గడ్కరీ ఉపరితల రవాణా మంత్రి అయ్యాక జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా మార్గాలను జాతీయ రహదారులుగా మార్చారు. ఇలానే దేశంలో చాలావాటికి మహర్దశ పట్టించారు. దీంతో రయ్‌మని దూసుకెళ్లేలా రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ వేగంపై నియంత్రణ ఎలా..? పర్యవేక్షణ ఎలా..? తప్పు చేస్తే దండించే మెకానిజం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఢిల్లీ-గురుగ్రామ్‌ మధ్య ఉన్న ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేపై చేస్తున్న ప్రయోగం అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఏటీఎంస్‌). కృత్రిమ మేధతో ఇదొక స్మార్ట్‌ రహదారిగా మారనుంది. ఏఐ సాయంతో ఈ హైవే మీద అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తెచ్చారు. క్రమంగా దేవవ్యాప్తంగా అమలుచేయాలని చూస్తున్నారు. ఇదే అమల్లోకి వస్తే విదేశాల తరహాలో మన జాతీయ రహదారులపై పకడ్బందీ పర్యవేక్షణ ఉన్నట్లే.

భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌... ఢిల్లీ-గురుగ్రామ్‌ హైవేపై ప్రవేశపెట్టే ఈ విధానాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు రూపొందించారు. అమలును మాత్రం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు అప్పగించారురు. 28 కిలోమీటర్ల మేర ద్వారకాతో పాటు ఎన్‌హెచ్‌-48పై మొత్తం 28 కిలోమీటర్లు అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో కృత్రిమ మేధ బేస్డ్‌గా స్మార్ట్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ ఉన్న డిజిటల్‌ హైవేగా మారింది.

ఈ ఉల్లంఘనలు ఇక చెల్లవ్‌..

వాహనదారులు సీటు బెల్టు పెట్టుకోకున్నా.. ఈ హైవేపై అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ కెమెరాలు వెంటనే పసిగడతాయి.

ఒకే బైక్‌పై ముగ్గురు వెళ్లడం, మితిమీరిన వేగం, హెల్మెట్‌ లేకపోవడం వంటి 14 రకాల ట్రాఫిక్‌ ఉల్లంఘనలను అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ గుర్తిస్తుంది.

విదేశాల తరహాలో ఈ-చలాన్‌ పోర్టల్‌ లింక్‌ అయి ఉంటుంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులకు వెంటనే సమాచారం వెళ్తుంది.

అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో 24 గంటల నిఘాతో కిమీకు ఒకటి చొప్పున మొత్తం 110 హై రిజల్యూషన్‌ పీటీజెడ్‌ కెమెరాలను అమర్చారు.

ట్రాఫిక్‌ మానిటరింగ్‌, ప్రమాదాల వీడియోల చిత్రీకరణ, వాహన వేగం, సందేశాల సైన్‌ బోర్డులు, సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌ అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో ఉంటాయి.

అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లోని కమాండ్‌ సెంటర్‌ కీలకం. ప్రమాదం జరిగితే తక్షణమే స్థానిక, జాతీయ రహదారి సిబ్బందికి సమాచారం పంపుతుంది. అలాగే రోడ్డుపై ఆటంకాలు ఏర్పడితే సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.

Tags:    

Similar News