సింగిల్ ఫైట్: దువ్వాడ గెలిచేటైపైనా?!
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా కొందరు నాయకులు రాజకీయాల్లో వేసే వేషాలు.. అంతగా సక్సెస్ కావన్నది అందరికీ తెలిసిందే.
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా కొందరు నాయకులు రాజకీయాల్లో వేసే వేషాలు.. అంతగా సక్సెస్ కావన్నది అందరికీ తెలిసిందే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇలానే ఉంది. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే.. స్వతంత్రంగానే పోటీ చేస్తానని.. గెలిచి తీరుతానని చెబుతున్నారు. నిజానికి ఇలాంటి ప్రకటనలు చేయడం చాలా తేలిక. కానీ.. నిరూపించుకోవడం, సాధించడం మాత్రం అంత తేలికకాదు.
ఒకప్పుడు ఒంటరిగా పోరాటం చేసేందుకు నాయకులు పెద్దగా వెనుకాడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బలమైన పార్టీల హవా.. ప్రభుత్వాల దూకుడు వంటివి ఎక్కువగా పనిచేస్తున్నాయి. అంతేకాదు, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను.. వారి గ్రాఫ్‌నుకూడా ప్రజలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అభ్యర్థుల వ్యవహార శైలి కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ఇది వ్యక్తిగత అంశాల వరకు కూడా ప్రభావితం అవుతోంది.
ఈ రకంగా చూసుకుంటే.. దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత ఇమేజ్ ఇబ్బందుల్లో ఉందనే చెప్పాలి. కుటుంబాన్ని ఆయన దూరం పెట్టి.. సహజీవనం చేస్తున్న వైనం.. సొంత అనుచరుల మధ్యే చర్చకు వస్తోంది.ఇక, నియోజకవర్గం రాజకీయంగా ఇది వివాదం అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. దువ్వాడకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ కూడా పెద్దగా కనిపించడం లేదు. నియోజకవర్గంలో ప్రజలకు ఏమైనా సేవ చేసి ఉంటే.. దానిని చెప్పుకొనేందుకు అవకాశం ఉండేది. కానీ, అలాంటిదేమీ లేదు.
ఇటు వైపు చూసుకుంటే టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి ముందు దువ్వాడ తేలిపోతున్నారు. రాజకీయ పరంగా చూసుకున్నా.. వ్యక్తిగతంగా చూసుకున్నా.. రామ్మోహన్ ముందు దువ్వాడ ఎక్కడా సమ ఉజ్జీ కాడన్న వాదన ఉంది. గతంలో ఎప్పుడోపోటీ చేసినప్పుడు భారీ ఓట్లు వచ్చాయని అనుకున్నా.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో దువ్వాడ చిందులు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒంటరి పోరు.. దువ్వాడకు చేదు అనుభవమే అవుతుందని అంటున్నారు.