ఇన్ స్టాలో విడాకులు.. సింగర్ తో దుబాయ్ యువరాణి నిశ్చితార్థం
షేకా మహ్రా, ఫ్రెంచ్ మోంటానా ప్రేమకథ గురించి గత కొంతకాలంగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.;
దుబాయ్ పాలకుడు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె షేకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ (31) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన భర్తకు విడాకులు ఇచ్చిన ఆమె, ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ రాపర్ ఫ్రెంచ్ మోంటానా (41)తో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ మోంటానా ప్రతినిధి అధికారికంగా ధృవీకరించారు.
- ప్రేమ కథకు నాంది
షేకా మహ్రా, ఫ్రెంచ్ మోంటానా ప్రేమకథ గురించి గత కొంతకాలంగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. విడాకుల తర్వాత దుబాయ్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడం, పారిస్ ఫ్యాషన్ వీక్‌లో కలిసి పాల్గొనడం వంటి సంఘటనలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ఈ ఏడాది జూన్‌లో పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా నిశ్చితార్థం జరిగినట్లు మోంటానా ప్రతినిధి వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు గోప్యంగా ఉంచారు. రెండు కుటుంబాలు ఈ బంధాన్ని ఆమోదించాయని, త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తారని సమాచారం.
- మొదటి వివాహం, విడాకుల సంచలనం
షేకా మహ్రా గతంలో దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌ను వివాహం చేసుకున్నారు. 2023 మే 27న జరిగిన ఈ పెళ్లి కేవలం ఒక సంవత్సరం మాత్రమే కొనసాగింది. వారికి ఒక బిడ్డ కూడా ఉంది. 2024 జులైలో మహ్రా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో "ఐ డివోర్స్ యూ.. టేక్ కేర్" అని పోస్ట్ చేసి అందరినీ షాక్ గురిచేశారు. ఈ పోస్ట్ అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అంతేకాదు విడాకుల తర్వాత 'డివోర్స్' అనే పేరుతో ఒక ప్రత్యేక పర్ఫ్యూమ్‌ను కూడా విడుదల చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
- ఫ్రెంచ్ మోంటానా ఎవరు?
మొరాకో-అమెరికన్ రాపర్ అయిన ఫ్రెంచ్ మోంటానా అసలు పేరు కరీమ్ ఖార్బుచ్. 'అన్‌ఫర్గెటబుల్' , 'నో స్టైలిస్ట్' వంటి పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గతంలో నదీన్‌ను వివాహం చేసుకున్న మోంటానాకు విడాకుల తర్వాత 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
- ప్రజల స్పందన
ఈ నిశ్చితార్థం వార్త బయటకు వచ్చిన తర్వాత, షేకా మహ్రాకు, ఫ్రెంచ్ మోంటానాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత త్వరగా రెండో పెళ్లి నిర్ణయం తీసుకున్నందుకు షేకా మహ్రా ధైర్యాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ కొత్త బంధం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దుబాయ్ యువరాణి-అమెరికన్ రాపర్ బంధం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.