ప్రపంచంలోనే తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్.. ఘనత సాధించిన దుబాయ్..
భవిష్యత్తు రవాణా వ్యవస్థ ఎలా ఉండబోతుందో దుబాయ్ నగరం ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.;
భవిష్యత్తు రవాణా వ్యవస్థ ఎలా ఉండబోతుందో దుబాయ్ నగరం ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ట్రాఫిక్ కష్టాలకు కాలం చెల్లుతూ, ఆకాశ మార్గంలో ప్రయాణించే ‘ఫ్లయింగ్ టాక్సీల’ యుగం అధికారికంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే తొలి ఎయిర్‌టాక్సీ స్టేషన్ సిద్ధం కావడంతో, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే దృశ్యాలు ఇక సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. టెక్నాలజీ, వినూత్న నిర్మిణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దుబాయ్, రవాణా రంగంలో మరో సంచలనానికి తెరలేపింది. ప్రపంచంలోనే మొట్ట మొదటి పూర్తి స్థాయి ఎయిర్‌టాక్సీ స్టేషన్‌ను దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నిర్మించి సిద్ధం చేసింది. దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును ప్రారంభించడంతో, 2026 నాటికి దుబాయ్ ఆకాశంలో ఎగిరే టాక్సీల సందడి మొదలుకానుంది. ట్రాఫిక్ రద్దీతో సంబంధం లేకుండా, గంటల ప్రయాణాన్ని నిమిషాల్లో ముగించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
ఎయిర్‌టాక్సీ స్టేషన్..
దుబాయ్ ప్రభుత్వం ‘స్కైపోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ ‘రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ’ భాగస్వామ్యంతో ఈ స్టేషన్‌ను నిర్మించింది. సుమారు 3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్ నిర్మితమైంది. ఇది కేవలం ఒక ల్యాండింగ్ ప్యాడ్ మాత్రమే కాదు, ప్రయాణికుల కోసం అత్యాధునిక వెయిటింగ్ లాంజ్‌లు, సెక్యూరిటీ చెక్-ఇన్ పాయింట్లను కలిగి ఉంది. ఏడాదికి సుమారు 1,70,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణించేలా సౌకర్యాలను కల్పించారు. ఇందులో రెండు ల్యాండింగ్ ప్యాడ్‌లు, ఎలక్ట్రిక్ విమానాల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు, ప్రయాణికుల కార్ల కోసం రెండు అంతస్తుల పార్కింగ్ సదుపాయం ఉన్నాయి.
45 నిమిషాల ప్రయాణం.. 10 నిమిషాల్లోనే..!
ఈ ఎయిర్‌టాక్సీల ప్రధాన ఉద్దేశం సమయాన్ని ఆదా చేయడం. ఉదాహరణకు, దుబాయ్ విమానాశ్రయం నుంచి 'పామ్ జుమేరా' లేదంటే 'దుబాయ్ మెరీనా' వంటి ప్రాంతాలకు కార్లలో వెళ్లాలంటే ట్రాఫిక్ వల్ల 45 నుంచి 50 నిమిషాలు పడుతుంది. కానీ ఎయిర్‌టాక్సీలో ఈ దూరాన్ని కేవలం 10, 12 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇది బిజీగా ఉండే వ్యాపారవేత్తలకు, పర్యాటకులకు ఒక గొప్ప వరంగా మారనుంది.
ఏమిటీ ఎయిర్‌టాక్సీలు..?
ఎయిర్‌టాక్సీలు అంటే ఒక రకమైన 'ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్' విమానాలు. ఇవి చూసేందుకు పెద్ద డ్రోన్ల మాదిరిగా, క్వాడ్ కాప్టర్ తరహాలో ఉంటాయి. వీటికి రన్ వే అవసరం లేకుండా నిలువుగా గాల్లోకి లేవగలవు, ల్యాండ్ కూడా అవ్వగలవు. వీటిలో పైలట్‌తో పాటు ఇద్దరి నుంచి ఆరుగురు ప్రయాణించే అవకాశం ఉంటుంది. పూర్తిగా బ్యాటరీతో నడుస్తాయి కాబట్టి శబ్దం తక్కువ, పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. కేవలం ప్రయాణికులకే కాకుండా, అత్యవసర వైద్య సేవలు. కార్గో లాజిస్టిక్స్ మరియు ఎమర్జెన్సీ రెస్క్యూ కోసం కూడా వీటిని వాడనున్నారు.
నాలుగు స్టేషన్ల నెట్‌వర్క్
దుబాయ్ ప్రభుత్వం కేవలం ఒక స్టేషన్‌తో ఆగిపోవడం లేదు. 2026 చివరి నాటికి నగరం మొత్తం నాలుగు కీలక ప్రాంతాల్లో ఎయిర్‌స్టేషన్లను అందుబాటులోకి తేనుంది. అందులో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఇప్పటికే ఇది సిద్ధమైంది), డౌన్‌టౌన్ దుబాయ్ (బుర్జ్ ఖలీఫా పరిసరాలు), పామ్ జుమేరా, దుబాయ్ మెరీనాలో స్టేషన్లు నిర్మించబోతోంది. ఈ నాలుగు ప్రాంతాలను అనుసంధానించడం ద్వారా నగరంలో రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేయాలని దుబాయ్ యువరాజు లక్ష్యంగా పెట్టుకున్నారు.
దుబాయ్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో లండన్, న్యూయార్క్, మన దేశంలోని ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు మోడల్‌గా నిలవనుంది. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల నేల మీద రవాణా కష్టంగా మారుతున్న తరుణంలో, ఆకాశమే సరైన మార్గమని దుబాయ్ నిరూపిస్తోంది. 2026 చివరి నాటికి దుబాయ్ వెళ్లే పర్యాటకులు విమానాశ్రయం బయటకు రాగానే కారు ఎక్కే బదులు, నేరుగా ఎయిర్‌టాక్సీ ఎక్కి తమ హోటళ్లకు చేరుకునే అద్భుత దృశ్యాన్ని మనం చూడబోతున్నాం.