8 ఏళ్లలో ఆరు శౌర్య పతకాలు.. తెలుగు ఐపీఎస్ ఘనత
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూనిఫాం సర్వీసుల్లో ఉన్న అధికారులకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రదానం చేస్తుంటుంది.;
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూనిఫాం సర్వీసుల్లో ఉన్న అధికారులకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రదానం చేస్తుంటుంది. విధి నిర్వహణలో ధైర్య సాహసాలు, అంకితభావం ప్రదర్శించిన పోలీసు సిబ్బందికి జాతీయ స్థాయిలో ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా, ఒకే అధికారికి మళ్లీ మళ్లీ పతకాలు వస్తున్నాయంటే చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. సైన్యంతోపాటు భద్రతా బలగాల్లో అసమాన్య సౌర్యపరక్రమాలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన సిబ్బందికి ఈ ఏడాది కూడా మెడల్స్ ప్రధానం చేశారు. అయితే ఈ ఏడాది ఓ తెలుగు ఐపీఎస్ అధికారి శౌర్య పతకానికి ఎంపికై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి శౌర్య పతకానికి ఎంపికైన తెలుగు ఐపీఎస్ గత 8 ఏళ్లలో మొత్తం ఆరు సార్లు ఈ పతకానికి ఎంపిక అవడం గమనార్హం.
శ్రీనగర్ లో సీనియర్ ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి ఆరోసారి రాష్ట్రపతి శౌర్య పతకానికి ఎంపిక అయ్యారు. ఏపీలోని కర్నూలుకు చెందిన ఆయన కాశ్మీర్ కేడర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. గత ఎనిమిది ఏళ్లలో ఆరు సార్లు రాష్ట్రపతి శౌర్య పతకాన్ని తీసుకోవడం ద్వారా డాక్టర్ సందీప్ చక్రవర్తి అరుదైన రికార్డు సాధించారు. ఐపీఎస్ అధికారి డాక్టర్ సందీప్ చక్రవర్తి తల్లిదండ్రులు కర్నూలులోనే నివసిస్తున్నారు. ఆయన తండ్రి డాక్టర్ జీవీ రామగోపాలరావు కర్నూలు సర్వజన వైద్యశాలలో డాక్టరుగా పనిచేశారు. ఆర్ఎంవోగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తల్లి పీసీ రంగమ్మ కూడా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు.
డాక్టర్ జీవి రామగోపాలరావు, రంగమ్మ మూడో కుమారుడైన డాక్టర్ సందీప్ చక్రవర్తి 2014లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. కర్నూలులోనే మెడిసిన్ చదివిన డాక్టర్ సందీప్ చక్రవర్తి తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం కాశ్మీర్ కేడర్ కేటాయించడంతో తొలుత శ్రీనగర్ లో అదనపు ఎస్పీగా తొలి పోస్టింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో పలు చోట్ల విధులు నిర్వహించారు. ప్రస్తుతం సీనియర్ ఎస్పీ ర్యాంకులో ఉన్న డాక్టర్ సందీప్ చక్రవర్తి శాంతిభద్రతల పరిరక్షణ, విద్రోహ, అరాచక శక్తుల ఆటకట్టించడంలో చూపిన ధైర్య సాహసాలను ప్రభుత్వం గుర్తించింది. 2017లో తొలిసారి శౌర్య పురస్కారానికి ఎంపిక అయిన డాక్టర్ సందీప్ చక్రవర్తి మొత్తం ఆరు సార్లు ఈ అవార్డును తీసుకున్నారు. అంతేకాకుండా నాలుగు సార్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ అవార్డును కూడా దక్కించుకున్నారు.
స్వాతంత్ర్య వేడుకలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ అవార్డులను ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన 16 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి శౌర్య పతకాలు లభించాయి. సరిహద్దుల్లోని వేర్వేరు పోస్టుల్లో విధులు నిర్వహించిన బీఎస్ఎఫ్ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా సుమారు 1090 మంది పోలీసులకు సైతం ఉత్తమ సేవా పతకాలకు ఎంపిక చేసింది. 233 మందికి గ్యాలెంట్రీ పతకాలు, 99 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు ప్రకటించింది. ఇక జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్న 152 మందికి శౌర్య పతకాలు ప్రకటించింది. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో పనిచేస్తున్నవారి కంటే అధికంగా జమ్మూ కాశ్మీర్ లో పనిచేసిన వారే అధికంగా అవార్డులు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన వారు 54 మంది, ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్నవారు 27 మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు.