సౌదీ యువరాజుకు ట్రంప్‌ విచిత్ర ప్రశ్న

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాలో పర్యటించారు.;

Update: 2025-05-14 12:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాలో పర్యటించారు. ఈ సందర్భంగా సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌)పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. రియాద్‌ను ప్రపంచ వ్యాపార కేంద్రంగా మార్చడంలో ఎంబీఎస్‌ చేసిన కృషిని కొనియాడారు. అయితే, ఈ క్రమంలో ట్రంప్‌ సంధించిన ఓ విచిత్ర ప్రశ్న ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రియాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. "మహమ్మద్‌.. మీరు రాత్రిపూట నిద్ర పోతారా? మీరు ఎలా నిద్రపోతారు? సౌదీని ఎంతో గొప్పగా చేశారు. మాలో ఒకరిలా ఉంటూనే.. ఇంతలా ఎలా అభివృద్ధి చేశారు" అని ప్రశ్నించారు. సౌదీ అభివృద్ధి సాధ్యమేనా అని ఎంతోమంది విమర్శకులు సందేహించారని, అయితే ఎంబీఎస్‌ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ అభివృద్ధి చేసి చూపించారని ట్రంప్‌ ప్రశంసించారు. తనకు ఎంబీఎస్‌ అంటే ఎంతో అభిమానమని కూడా పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలకు సభలో ఉన్నవారు లేచి నిలబడి కరతాళధ్వనులు తెలిపారు.

ఈ సమావేశంలోనే సిరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సిరియాకు పునర్‌నిర్మాణం , అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించడమే దీని వెనుక ఉద్దేశ్యమని తెలిపారు.

ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో అమెరికా-సౌదీ అరేబియా మధ్య పలు కీలక ఆర్థిక, ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ఇరాన్‌ అణు కార్యక్రమం, గాజాలో జరుగుతున్న సంఘర్షణ వంటి ప్రాంతీయ అంశాలపై ఎంబీఎస్‌, ట్రంప్‌ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆర్థిక, ద్వైపాక్షిక సహకారం, సైనిక రంగాలకు సంబంధించిన డజనుకు పైగా ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఇందులో 600 బిలియన్‌ డాలర్ల సౌదీ పెట్టుబడి కట్టుబాటు.. దాదాపు 142 బిలియన్‌ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం ఉన్నట్లు సమాచారం. ఇరాన్‌ ఒక కొత్త, మెరుగైన మార్గాన్ని ఎంచుకోవాలని ట్రంప్‌ ఈ సందర్భంగా సూచించారు.

ట్రంప్‌ ఎంబీఎస్‌నుద్దేశించి నిద్ర గురించి అడిగిన ప్రశ్న ఆశ్చర్యం కలిగించినా, సౌదీ అరేబియాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆయన పడుతున్న అకుంఠిత దీక్షను పరోక్షంగా ప్రశంసించడమే ట్రంప్‌ ఉద్దేశ్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ట్రంప్‌ సౌదీ పర్యటన ఇరు దేశాల సంబంధాలలో కొత్త అధ్యాయానికి తెర తీసిందని చెప్పవచ్చు.

Tags:    

Similar News