భారత్ విషయంలో మారిన ట్రంప్ స్వరం.. జాతకం చెబుతున్నారా?
జరిగింది చెబుతాము, జరబోయేది చెబుతాము అన్నట్లుగా భారత్ తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతకాలు చెప్పినట్లుగా మాట్లాడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ఇప్పటికే చాలా సార్లు మాట్లాడిన ట్రంప్.. ఈ సారి మాత్రం స్వరం కాస్త మార్చారు.. ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీపై ప్రశంసలు కురిపించారు.
అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ను ఉద్దేశిస్తూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రస్తావిస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రష్యా చమురు కొనుగోళ్ల విషయంపై స్పందిస్తూ... ఆ దేశ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ గతంలో ప్రకటించిన ఆయన... తాజాగా భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనబోదంటూ వ్యాఖ్యానించారు.
మొన్నటివరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ స్వయంగా ప్రకటించేసిన ట్రంప్.. తాజాగా మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనబోదని వ్యాఖ్యానించారు. అందుకు కారణం... తనలాగానే మోడీ కూడా ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం ముగియాలని కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. అయితే.. దీనిపై భారత్ ఏమాత్రం స్పందించలేదు!
వైట్ హౌస్ లో దీపావళి!:
స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సహా కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ - అమెరికన్లకు ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తనకు భారతీయులంటే చాలా ఇష్టమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు.
ఇందులో భాగంగా... ఆయన గొప్ప వ్యక్తి అని, గొప్ప స్నేహితుడని కొనియాడారు. మోడీతో తాను ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తమ మధ్య గొప్ప సంభాషణ జరిగిందని.. అనేక విషయాల గురించి తాము మాట్లాడుకున్నామని.. ప్రధానంగా వాణిజ్యం గురించి చాలాసేపు చర్చించామని.. ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉందని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే.. ట్రంప్, మోడీల ఫోన్ సంభాషణ గురించి భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం!:
భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం అతిత్వరలో ఖరారయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ ఒప్పందంతో భారత్ పై ట్రంప్ టారిఫ్ లు భారీగా దిగి రానున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో.. ప్రస్తుతం 50శాతం ఉన్న టారిఫ్ లు.. 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా వాణిజ్య ఒప్పందం ఖరారుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి తన వద్ద ఎలాంటి ఇన్ సైడర్ సమాచారం లేదు కానీ... రాబోయే రెండు నెలలు లేదా అంతకంటే ముందే ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకుని ఒప్పందంపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు.