మేం కాంగ్రెస్ ప‌క్క‌న కూర్చోలేం.. వేరే సీట్లు ఇవ్వండి: డీఎంకే

త‌మిళ‌నాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం.. పొత్తుల వ్య‌వ‌హారంలో పెద్ద చిక్కు వ‌చ్చింది.;

Update: 2026-05-08 17:03 GMT

త‌మిళ‌నాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం.. పొత్తుల వ్య‌వ‌హారంలో పెద్ద చిక్కు వ‌చ్చింది. నిన్న‌టి వ‌ర‌కు డీఎంకేతో చేతులు క‌లిపిన కాంగ్రెస్‌.. ఎన్నిక‌ల‌కు కూడా వెళ్లింది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు ద‌క్కించుకుంది. అయితే.. ఫ‌లితాల త‌ర్వాత అధికార డీఎంకే గ‌ద్దె దిగిపోవ‌డంతోపాటు.. న‌టుడు విజ‌య్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. అధికారంలోకి వ‌చ్చేందుకు మెజారిటీ సీట్లు ద‌క్క‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ పార్టీ టీవీకేతో చేతులు క‌లిపింది. త‌ద్వారా సుదీర్ఘ‌కాలంగా డీఎంకేతో ఉన్న పొత్తును తెంచుకుంది.

ఈ ప‌రిణామాలు... త‌మిళ‌నాట ప్ర‌కంప‌న‌లు రేపాయి. ముఖ్యంగా డీఎంకే ఈ వ్య‌వ‌హారంపై నిప్పులు చెరిగింది. రాష్ట్రంలో అవ‌కాశ వాద రాజ‌కీయాలు చేసిన కాంగ్రెస్‌తో భ‌విష్య‌త్తులోనూ పొత్తు ఉండ‌ద‌ని తేల్చి చెప్పింది. ప్ర‌స్తుతం డీఎంకే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ న‌డిపిస్తున్న ఇండియా కూట‌మిలోనూ మిత్ర‌ప‌క్షంగా ఉంది. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో జాతీయ స్థాయి పొత్తును కూడా వ‌దులుకుంది. ఇండీ కూటమికి డీఎంకే గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు వెల్లడించింది. అంతేకాదు.. దీనిపై డీఎంకే ఎంపీ క‌నిమొళి మ‌రో అడుగు ముందుకువేశారు.

తమకు లోక్‌సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్ ఓం బిర్లాకు డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ రాశారు. కాంగ్రెస్‌ ఎంపీల పక్కన కూర్చోలేమని అందులో పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు తెలపడంతో డీఎంకే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు డీఎంకే ఎప్పుడూ దూరంగా ఉంటుంద‌ని క‌నిమొళి వ్యాఖ్యానించారు. ద‌శాబ్దాల పాటుత‌మ‌తో చేతులుక‌లిపి.. ఇప్పుడు త‌మ‌ను వదిలేయ‌డం అత్యంత దారుణ‌మ‌ని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలాంటి పార్టీ తో క‌లిసిరాజ‌కీయాలు చేయ‌లేమ‌ని విమ‌ర్శించారు.

Tags:    

Similar News