డీకే నోట ఆర్ఎస్ఎస్ పాట...హింట్ ఇస్తున్నారా ?

ఆయనకు ట్రబుల్ షూటర్ అని పేరు. పార్టీలో ఏదైనా ట్రబుల్ వస్తే ఆయనను పంపిస్తే చాలు క్షణాలలో పరిష్కారం చేస్తారు.;

Update: 2025-08-22 21:30 GMT

ఆయనకు ట్రబుల్ షూటర్ అని పేరు. పార్టీలో ఏదైనా ట్రబుల్ వస్తే ఆయనను పంపిస్తే చాలు క్షణాలలో పరిష్కారం చేస్తారు. అంతలా కాంగ్రెస్ లో మంచి పేరు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఈ కన్నడ కాంగ్రెస్ దిగ్గజ నేత ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ నోట ఆర్ఎస్ఎస్ గీతం పలికింది అంటే ఏమనుకోవాలి అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ అంటే ఇంతెత్తున ఎగిరిపడుతుంది. అలాంటిది నిండు అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ ప్రార్ధనా గీతాన్ని ఆలపించి డీకే శివకుమార్ కాంగ్రెస్ కి తానే ట్రబుల్స్ ని క్రియేట్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

అంతా షాక్ అయిన సన్నివేశం :

కర్ణాటక అసెంబ్లీలో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనపై చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన నాయకుడు ఆర్ అశోక్ డీకే శివకుమార్ కి ఆర్ఎస్ఎస్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. అంతే డీకే శివకుమార్ ఒక్కసారిగా లేచి మాట్లాడటం ప్రారంభించారు. ఇంతలోనే ఆయన ఆర్ఎస్ఎస్ ప్రార్ధనా గీతాన్ని కూడా ఆలపించారు. మస్తే సదా వత్సలే మాతృభూమి అంటూ డీకే పాడడం ఆరంభించారు. డీకే శివకుమార్ ఈ విధంగా చేయడం తో ఒక్కసారిగా సభలో అంతా షాక్ అయ్యారు. ఆ వెంటనే బీజేపీ సభ్యులు ఆనందంతో బల్లలు చరిచారు.

ఎన్నో అనుమానాలు :

ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ పేరు చెబితేనే కాంగ్రెస్ పెద్దలు మండుతారు. అలాంటి పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ డీకే ఈ విధంగా ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం ఆలపించడం ద్వారా హింట్ ఇచ్చేశారా అన్న చర్చ సాగుతోంది. ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. కానీ సిద్ధరామయ్య ఫుల్ టెర్మ్ కొనసాగేలా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనను కోరుకుంటున్నారు. దాంతో ఆయన బీజేపీ మద్దతుతో అయినా తన చిరకాల కోరిక నెరవేర్చుకోవడానికి ఈ విధంగా సంకేతాలు ఇచ్చేశారా అన్నదే అంతటా చర్చ.

కాంగ్రెస్ తోనే జీవితమంతా :

అయితే ఇది జరిగిన తర్వాత మీడియాకు డీకే పూర్తి వివరణ ఇచ్చారు. తాను నూరు శాతం కాంగ్రెస్ వాడిని అన్నారు. తన పుట్టుక ఎదుగుదల అంతా కాంగ్రెస్ లోనే ఉందని అన్నారు. తాను అన్ని పార్టీలను స్టడీ చేస్తాను అన్నారు. వారిలో మంచి ఉంటే కూడా గమనిస్తాను అన్నారు. ఆర్ఎస్ఎస్ గురించి కూడా ఎంతో చదివాను అన్నారు. ప్రత్యర్ధులలో కూడా మంచి ఉంటే గ్రహించాలని అన్నారు. అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీ ఆర్ఎస్ఎస్ వైపు వెళ్ళే ప్రసక్తి లేదని జీవితాంతం కాంగ్రెస్ వాదిగానే ఉంటాను అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

అలజడి రేపారే :

మొత్తం మీద చూస్తే డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతాన్ని ఆలపించి రాజకీయ అలజడి రేపారు అని అంటున్నారు. ఆయన బీజేపీలో చేరను అని స్పష్టంగా చెప్పినా రాజకీయాలు కాబట్టి ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి అందువల్ల ఏమో అన్న చర్చ అయితే అలాగే సాగుతోంది. మరో వైపు చూస్తే డీకే లాంటి వారి మీద ప్రత్యర్ధుల కన్ను ఎపుడూ ఉంటుంది. అందువల్ల ఆయనకు గేలం వేయడం జరుగుతుంది. అయితే ఆయన మాత్రం తాను కాంగ్రెస్ వాదినే అంటున్నారు. మొత్తానికి చూస్తే కర్ణాటకలో ఇపుడు డీకే ఒక సంచలనమే రేపారు అని అంటున్నారు.

Tags:    

Similar News