రామచంద్రా అంటున్నా ఉలకని పలకని మంత్రిగారు

అదేంటో రాజకీయం అంతా లెక్కలే. తేడా వస్తే చుక్కలే. ఒక్కటి అటూ ఇటూ అయినా మా చెడ్డ గొడవలు వచ్చేస్తాయి.;

Update: 2025-09-18 06:30 GMT

అదేంటో రాజకీయం అంతా లెక్కలే. తేడా వస్తే చుక్కలే. ఒక్కటి అటూ ఇటూ అయినా మా చెడ్డ గొడవలు వచ్చేస్తాయి. అందుకే ఎంచక్కా కడుపులో చల్ల కదలకుండా రాజకీయం చేసుకోవాలని ప్రతీ రాజకీయ నేతా అనుకుంటారు. కానీ వ్యవహారం అలా ఉండదు కదా. సీన్ లోకి దిగితే కదా సినిమా తెలిసేది అన్నట్లుగా పాలిటిక్స్ లో ఎన్ని ట్విస్ట్ లో మరెన్ని బిగ్గెస్ట్ రిస్కులో. అందుకే ఏ మూలన ఏ చిన్న పాటి ప్రకంపన వచ్చినా చిగురుటాకులా ఉలికిపడేదే రాజకీయం.

లక్కీగా చాన్స్ అందుకున్నా :

కోనసీమ జిల్లా కోటాలో మంత్రి పదవిని అందుకున్నారు రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్. అయితే గత పదిహేను నెలలుగా ఆయన పనితీరు మీద సొంత పార్టీలోనే అదొక రకమైన అసంతృప్తి ఉంది. ఇక మంత్రిగా దూకుడు చూపించాలని ప్రభుత్వ పెద్దలు కోరుకుంటున్నారు. ఆ మధ్య అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అంటే ఈయన పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇంతలో జోరు పెంచి మంత్రిగా తన హవా చాటుకుంటున్నారు.

సొంత చోటే కొత్త డిమాండ్ :

ఇంతలో సొంత నియోజకవర్గంలోనే కొత్త డిమాండ్ ఒకటి ఊపందుకుంటోంది. జిల్లాల పునర్విభజనకు కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో ప్రతీ జిల్లా నుంచి నియోజకవర్గం నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అలా రామచంద్రాపురం నియోజకవర్గం వాసులు కూడా తమ ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపమని కోరుకుంటున్నారు. 2022లో వైసీపీ పాలనలో కొత్త జిలాలను కేవలం లోక్ సభ నియోజకవర్గం ప్రాతిపదికగా చేసుకుని విభజించారు. అలా రామచంద్రాపురం నియోజకవర్గం కోనసీమ జిల్లాకు వెళ్ళిపోయింది. మొత్తం తూర్పు గోదావరి జిల్లా కాస్తా మూడు అయింది. రాజమండ్రి కేంద్రంగా తూర్పు గోదావరి, అలాగే కాకినాడ జిల్లా, అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు అయ్యాయి.

దూరంతో భారం :

ఇక చూస్తే కనుక రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం కాకినాడ జిల్లాకు కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే అమలాపురం జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో తమకు పాలనా సౌలభ్యం కోసం కాకినాడ జిల్లాలో కలపమని రామచంద్రపురం వాసులు అంతా ఒక్కటిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న కాజులూరు మండలం కాకినాడలోనే ఉంది. ఇక గంగవరం, రామచంద్రాపురం మండలం, మునిసిపాలిటీ కాకినాడ కలిపేస్తే తమకు ఎంతో మేలు అంటున్నారు జనాలు. దీని మీద మంత్రి వర్గ ఉప సంఘం కూడా సానుకూలంగా ఉందని వార్తలు వస్తున్నాయిట.

జిల్లా మారితే తంటాయే :

ఇక మంత్రి వాసంశెట్టి సుభాష్ మాత్రం ఈ డిమాండ్ పట్ల పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే కాకినాడ జిల్లాకు తన నియోజకవర్గం మారితే రాజకీయం మొత్తం మారుతుంది అని ఆయన కలవరపడుతున్నారుట. కాకినాడ జిల్లా అంటే ఎంతో మంది బిగ్ షాట్స్ ఉంటారు. దాంతో మంత్రి కోటాలో ఎంతో మంది రేసులోకి వచ్చేస్తారు. అదే కోనసీమ జిల్లా కోటాలో అయితే పెద్దగా ఇబ్బంది ఉండదని ఆయన ఆలోచన అని అంటున్నారు. అంతే కాదు వాసంశెట్టిది అమలాపురం సొంత నియోజకవర్గం అని చెబుతున్నారు. అది రిజర్వ్ అయిది దాంతో రామచంద్రపురం కి షిఫ్ట్ అయి పోటీ చేస్తున్నారు. ఇపుడు కాస్తా ఏకంగా జిల్లావే మారితే తన మంత్రి పదవే కాదు రాజకీయమే కూడా మొత్తం మారిపోతుందని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అందుకే తన వద్దకు కాకినాడలో నియోజకవర్గాన్ని కలపమని డిమాండ్ తో ఎవరు వచ్చినా చూద్దాం చేద్దాం అంటున్నారు తప్పించి పెద్దగా మాట్లాడటం లేదని టాక్. మంత్రి మౌనం వెనక రాజకీయ వ్యూహం ఉంటే నియోజకవర్గం వాసులు మాత్రం కాకినాడ మోజు మీద ఉన్నారుట. మరి జిల్లాల మార్పులో ఎవరెటు వెళ్తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News