కాక్రోచ్‌ల లొల్లి ఇండియాలో అయిపోయింది... ఇప్పుడు లండన్‌లో మొదలైంది

ప్రముఖ యూట్యూబర్, రాజకీయ విశ్లేషకుడు ధ్రువ్ రాఠీ ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

Update: 2026-10-17 10:39 GMT

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల హక్కులు.. ఓటింగ్ పారదర్శకతపై రాజకీయ వేడి రోజురోజుకూ రాజుకుంటోంది. "ఓట్ చోరీ" పేరుతో ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు చేస్తోన్న ఆరోపణలు దేశంలో ఇప్పటికే తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో భారత రాజకీయాల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు సరిహద్దులు దాటి అంతర్జాతీయ వేదికకు చేరింది. భారతదేశంలో ముగిసినట్లు కనిపిస్తున్న ఈ వివాదాల గొడవ ఇప్పుడు బ్రిటన్ రాజధాని లండన్‌కు పాకింది.

లండన్‌లో 'ఓట్ చోరీ' నిరసనలకు పిలుపు

ప్రముఖ యూట్యూబర్, రాజకీయ విశ్లేషకుడు ధ్రువ్ రాఠీ ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. లండన్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులతో కలిసి ఓ భారీ నిరసన కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారని సమాచారం.

లండన్‌లోని చారిత్రాత్మక పార్లమెంట్ స్క్వేర్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం సమీపంలో ఈ నిరసన చేపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారత ఎన్నికల వ్యవస్థపై వస్తున్న ఆరోపణలను, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడమే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలపై, ప్రక్షాళనపై విమర్శకులు స్వరం పెంచుతున్న వేళ ఈ లండన్ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.

దేశీయ వేదిక నుంచి అంతర్జాతీయ మీడియా వరకు..

భారత్‌లోని ఓటర్ల జాబితాల మార్పులు, అక్రమాలపై రాజకీయ విమర్శలు కొత్తవి కాకపోయినా ఈ అంశాన్ని విదేశాల్లోని ప్రవాస భారతీయుల భాగస్వామ్యంతో అంతర్జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లడం సరికొత్త చర్చకు దారితీసింది.

లండన్ లాంటి అంతర్జాతీయ కేంద్రంలో నిరసనలు జరిగితే ప్రపంచ మీడియా చూపు దీనిపై పడే అవకాశం లేకపోలేదు. ప్రజాస్వామ్య పారదర్శకతకు సంబంధించిన అంశాలు కావడం వల్ల ఈ వార్తలకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే విశ్వసనీయ ఆధారాలు లేని ఆరోపణలు అంతర్జాతీయ వేదికలపైకి వెళ్లడం వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఎలాంటి స్పందన రానుంది?

ధ్రువ్ రాఠీ పిలుపునకు లండన్ ఎన్‌ఆర్ఐల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భారీ సంఖ్యలో ప్రవాసులు హాజరైతే ఈ అంశంపై అంతర్జాతీయంగా చర్చ తీవ్రమయ్యే అవకాశముంది. లేదంటే ఇది ఒక సాధారణ నిరసనగానే మిగిలిపోవచ్చు.

భారత్‌లో మొదలైన ‘ఓట్ చోరీ’ ఆరోపణల లొల్లి ఇప్పుడు లండన్ వీధుల్లోకి చేరడంతో రాబోయే రోజుల్లో ఎన్నికల సంఘం , ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News