రెండో రోజూ రణరంగమే.. రాయలసీమలో టెన్షన్.. టెన్షన్
ప్రధానంగా రాయలసీమలోని కొన్ని మున్సిపాలిటీలను వ్యక్తిగత ప్రతిష్టకు తీసుకోవడంతో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు గొడవలకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు శాంతిభద్రతల సమస్యగా మారాయి. నామినేషన్ వేసేందుకు రెండు పార్టీల వారు ఒకేసారి వస్తుండటం, ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోతూ సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటూ దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సిన పరిస్థితులు దాపురించాయని అంటున్నారు. ప్రధానంగా రాయలసీమలోని కొన్ని మున్సిపాలిటీలను వ్యక్తిగత ప్రతిష్టకు తీసుకోవడంతో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు గొడవలకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికలకు రేపటి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే పుంగనూరు, రాయచోటిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. రెండో రోజు ఆ రెండు పట్టణాల్లో పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇక వీటికి అదనంగా కడప, పులివెందుల, రాజంపేట తదితర చోట్ల కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. నామినేషన్లు వేయాల్సిన అభ్యర్థులు తమతో తుపాకులు, బులెట్లు, ఖాళీ సీసాలు, రాళ్లు తీసుకువస్తున్నారు. దీంతో ముందస్తు వ్యూహంతోనే దాడులకు సిద్ధమయ్యే నామినేషన్ కేంద్రాలకు వస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కడపలో ఓ అభ్యర్థి అనుచరుల నుంచి తుపాకీ, బులెట్లను స్వాధీనం చేసుకున్నారనే వార్తలు హీట్ పుట్టిస్తున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉద్రిక్తలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అంటున్నారు. అదేసమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లాలోనూ వైసీపీ గట్టిగా పోరాడుతుండటంతో గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. అధికార పార్టీకి దీటుగా ఎక్కడా తగ్గకూడదు అన్నట్లు వైసీపీ కూడా పోరాడుతోందని అంటున్నారు. దీంతో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయని చెబుతున్నారు. శనివారం కడప, రాజంపేట, పులివెందుల, తిరుపతి, దర్శి నియోజకవర్గాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఇక నామినేషన్ కార్యక్రమాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన రౌడీలు వస్తున్నారని జరుగుతున్న ప్రచారం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయంలో అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా హై అలర్ట్ లో ఉన్నారు. కడపలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పులివెందులలో కూడా ఆందోళనకారులపై లాఠీచార్జి చేసిన పోలీసులు, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. దర్శిలోనూ ఇదే పరిస్థితి నెలకుందని వార్తలు అందుతున్నాయి.