వంగవీటికి జై..జన సేన తొలి జాబితా విడుదల, 2 మేయర్, 12 మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఖరారు
ఇక రెండో మేయర్ అభ్యర్థిగా ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడుకు టికెట్ ఇచ్చింది. అదేవిధంగా 12 మున్సిపాలిటీలకు చైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది.
మున్సిపల్ ఎన్నికలకు జన సేన అభ్యర్థులు ఖరారు అయ్యారు. పొత్తుల్లో భాగంగా నాలుగు కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న జనసేన తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా విజయవాడ మేయర్ సీటు సస్పెన్స్ కు తెర దించింది. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన విజయవాడ మేయర్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను ఎంపిక చేసింది. ఇక రెండో మేయర్ అభ్యర్థిగా ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడుకు టికెట్ ఇచ్చింది. అదేవిధంగా 12 మున్సిపాలిటీలకు చైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది.
జనసేనకు మొత్తం నాలుగు కార్పొరేషన్లు కేటాయించగా, ప్రస్తుతం రెండు చోట్ల మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. పెండింగులో ఉన్న శ్రీకాకుళం, కాకినాడ కార్పొరేషన్లకు డిసెంబరులో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు కార్పొరేషన్ అభ్యర్థులను ప్రకటించింది. బెజవాడ మేయర్ అభ్యర్థిగా చాలాకాలంగా ప్రచారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను ఎంపిక చేసింది. ఈ ఎంపిక రాజకీయంగా ఊహించినప్పటికీ ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు. అదేవిధంగా ఏలూరు మేయర్ అభ్యర్థిగా తొలి నుంచి పార్టీని నమ్ముకున్న రెడ్డి అప్పల నాయుడును ఖరారు చేశారు.
అమలాపురం మున్సిపాలిటీ నుంచి నల్లా శ్రీధర్, చిలకలూరిపేటకు తోట రాజరాజేశ్వరి, గొల్లప్రోలులో కడారి తమ్మయ్య నాయుడు, నరసాపురంలో కొత్తపల్లి శైలజ, నిడదవోలులో కల్లం జ్యోతిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అదేవిధంగా పెడన నుంచి మట్టా శివ పావని, పిఠాపురం నుంచి డాక్టర్ బీరా విజయ్ శేఖర్, పుత్తూరు డి. ఏలుమలై పేర్లు ఖరారయ్యాయి. సాలూరులో గొర్లె విజయ కుమారి, సామర్లకోటలో పిట్టా జానకి రామారావు, తెనాలిలో తోటకూర వెంకట రమణారావు, తిరువూరులో పి.మాధవికి టికెట్లు ఇచ్చింది. మిగిలిన చోట్ల ఈ రోజు లేదా రేపు ఉదయం నాటికి ఖరారు చేసి రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
బెజవాడ అంతా ఓకే.. ఏలూరులోనే నిరసనలు
కాగా, మున్సిపల్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీ స్పందన ఆసక్తికరంగా మారింది. విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ ఎంపికపై అందరూ సంతృప్తిగా ఉన్నట్లుగానే పరిస్థితులు తెలియజేస్తున్నాయి. కానీ, ఏలూరులో జనసేన అభ్యర్థి విషయంలో టీడీపీ నేతలకు అభ్యంతరం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏలూరులో పార్టీ నేతల సమన్వయ సమావేశంలో ఈ అంశం స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. పార్టీ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ అనురాధా ముందే జనసేన అభ్యర్థి ఎంపికపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఏలూరు కార్పొరేషన్ నుంచి టీడీపీ పోటీ చేయాలని నేతలు ఆశించారు. కానీ, ఈ సీటును జనసేనకు కేటాయించడంపైనే అసంతృప్తితో ఉన్న నేతలు రెడ్డి అప్పలనాయుడు ఎంపికపై మరింతగా రగిలిపోతున్నట్లుగా చెబుతున్నారు.