టీడీపీలో చిన్న శ్రీనుకు తొలి షాక్.. విజయనగరం మేయర్ అభ్యర్థి ఎంపికపై అనూహ్య నిర్ణయం

విజయనగరం మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వు చేశారు. దీంతో చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్రకు లైన్ క్లియర్ అయినట్లే భావించారు.

Update: 2026-10-17 08:50 GMT

విజయనగరం మేయర్ సీటు ఎంపికపై టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ సీటు ఆశించి పార్టీలో చేరిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చిన్న శ్రీనుకు షాక్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర విజయనగరం మేయరుగా పోటీ చేయాలని భావించారని, ఈ కారణంగానే చిన్న శ్రీను టీడీపీలోకి వచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం చిన్న శ్రీను కుమార్తెను కాదని పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న అవనాపు భార్గవికి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఈ నిర్ణయం విజయనగరం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మేయర్ ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు మాటకే అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చిందని అంటున్నారు.

విజయనగరం మేయర్ అభ్యర్థిగా అవనాపు భార్గవిని ఎంపిక చేస్తూ టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. పార్టీపరంగా ఈ నిర్ణయాన్ని కార్యకర్తలు సమర్థిస్తున్నప్పటికీ, సీనియర్ నేత చిన్న శ్రీనుకు టీడీపీలో తొలి షాక్ ఎదురైనట్లుగా భావించాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత నెలలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన చిన్న శ్రీనుకు టీడీపీ రాజకీయాలు ఎలా ఉంటాయో ఈ నిర్ణయం ద్వారా తెలియజేసినట్లైందని అంటున్నారు. వైసీపీలో ఉండగా సర్వం తానై వ్యవహరించిన చిన్నశ్రీనుకు టీడీపీలో అటువంటి జోరు చూపేందుకు అవకాశం ఉండదని అధిష్టానం సంకేతాలు పంపిందని అంటున్నారు.

విజయనగరం మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వు చేశారు. దీంతో చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్రకు లైన్ క్లియర్ అయినట్లే భావించారు. కానీ, పార్టీ అధిష్టానం అనూహ్యంగా బీసీ మహిళ అవనాపు భార్గవికి అవకాశం ఇచ్చింది. అవనాపు కుటుంబం తొలి నుంచి టీడీపీలో ఉండేది. 2004 తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లిన అవనాపు కుటుంబం గత ఎన్నికల ముందు తిరిగి టీడీపీలోకి వచ్చింది. రెండున్నరేళ్లుగా ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజుకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అవనాపు భార్గవికి మేయర్ సీటు ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో సీనియర్ నేత చిన్న శ్రీనుకు ఆశాభంగం తప్పలేదని అంటున్నారు.

చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర మేయర్ గా పోటీ చేయాలని ఉవ్విళ్లూరారని అంటున్నారు. ఈ కారణంతోనే ఆమె గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీలో చేరారని చెబుతున్నారు. అయితే టీడీపీలోకి కొత్తగా వచ్చిన సిరి సహస్రకు మేయర్ సీటు ఎలా ఇస్తారని పార్టీ వర్గాల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయని అంటున్నారు. ఇది గమనించే పార్టీలో తొలి నుంచి ఉన్నవారికి అవకాశం ఇచ్చారని అంటున్నారు. అయితే చిన్న శ్రీను తన కుమార్తెకు మేయర్ సీటు ఆశించిన విషయం వాస్తవమే అయినప్పటికీ టీడీపీలో చేరిన తర్వాత అటువంటి ప్రయత్నాలు ఏవీ చేయలేదని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఆయనకు ఏ పదవి ఇవ్వాలనే అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, ఆ విషయంలో తమకు రెండో ఆలోచన లేదని అంటున్నారు. మొత్తానికి విజయనగరం మేయర్ సీటు ఎంపికతో చిన్న శ్రీను ఆశలు గల్లంతు చేశారన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది.

Tags:    

Similar News