బాలీవుడ్ అగ్రహీరోలకు మంటపెట్టిన ద్రువ్ రాఠీ..
ధ్రువ్ రాఠీ మాట్లాడుతూ... డిజిటల్ మీడియా ద్వారా తానే జీవితాంతం కూర్చొని తిన్నా సరిపోయేంత ఆదాయాన్ని సంపాదించగలిగానని..
ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ బాలీవుడ్ అగ్ర నటులను ఉద్దేశించి చేసిన విమర్శలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కోట్లాది రూపాయల సంపద ఉన్నప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోలు ప్రజా సమస్యలపై నోరు విప్పడంలేదని.. పైగా ఆరోగ్యానికి హాని కలిగించే పాన్ మసాలా ప్రకటనల్లో నటిస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. హీరోల సామాజిక బాధ్యతపై మరోసారి కొత్త చర్చకు తెరలేపింది.
సంపద ఉండి కూడా ఎందుకు మౌనం?
ధ్రువ్ రాఠీ మాట్లాడుతూ... డిజిటల్ మీడియా ద్వారా తానే జీవితాంతం కూర్చొని తిన్నా సరిపోయేంత ఆదాయాన్ని సంపాదించగలిగానని.. అలాంటప్పుడు వేల కోట్ల రూపాయల నికర ఆస్తి కలిగిన బాలీవుడ్ ప్రముఖులు ఆర్థిక భద్రత కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందనే వాదన బలంగా వినిపించారు.
పాన్ మసాలా ప్రకటనలు.. స్టార్ హీరోలపై ప్రశ్నలు
దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖులు భారీ పారితోషికాల కోసం పాన్ మసాలా ఉత్పత్తులను ప్రమోట్ చేయడంపై ప్రజల నుంచి, విమర్శకుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అక్షయ్ కుమార్ పాన్ మసాలా బ్రాండ్ ప్రచారంలో పాల్గొనడంపై తీవ్ర వ్యతిరేకత రాగా.. ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పి భవిష్యత్తులో బ్రాండ్ల ఎంపికలో జాగ్రత్తగా ఉంటానని ప్రకటించారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ, సామాజిక ప్రభావాన్ని విస్మరించి ఇటువంటి ఉత్పత్తుల ప్రచారానికి అంగీకరించడం ఎంతవరకు సమర్థనీయమనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న.
అభిమానులపై ప్రభావం ఎంత?
భారతదేశంలో సినిమాలకు, నటులకు ఉండే ఆదరణ వేరు. ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీరు ఉపయోగించే వస్తువులు లేదా ప్రచారం చేసే బ్రాండ్లను అభిమానులు అనుకరిస్తుంటారు. అందువల్ల ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఉత్పత్తులకు ప్రచారం కల్పించినప్పుడు, అది వినియోగదారుల నిర్ణయాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.
ప్రతి అంశంపై స్పందించాలా?
సెలబ్రిటీలు ప్రతి సామాజిక, రాజకీయ అంశంపై స్పందించాలా లేక తమకు అవగాహన ఉన్న అంశాలకే పరిమితం కావాలా అనే కోణంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నటుల వ్యక్తిగత సేవా కార్యక్రమాలు, విరాళాలు ఒకవైపు ఉన్నప్పటికీ... వ్యాపార ప్రయోజనాల కోసం చేసే ప్రచారాలు సమాజానికి హాని కలిగించకూడదనే విజ్ఞప్తి బలంగా వినిపిస్తోంది.
ప్రజల ఆదరణతో అపారమైన సంపద, గుర్తింపు పొందిన బాలీవుడ్ ప్రముఖులు కేవలం వాణిజ్య లాభాలకే ప్రాధాన్యం ఇస్తారా? లేదా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే బాధ్యతను కూడా నెరవేరుస్తారా? ధ్రువ్ రాఠీ వ్యాఖ్యల నేపథ్యంలో రేగిన ఈ చర్చ మున్ముందు ఎటువంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి.