'ముసుగు' తొలగింది.. 'ధర్మస్థల' చిక్కువీడింది.. అంతా అబద్ధమే
కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రఖ్యాత శైవ క్షేత్రం ధర్మస్థల. గతంలో ఇక్కడ శానిటరీ వర్కర్ గా పనిచేసి వెళ్లిపోయాడు భీమా.;
ప్రఖ్యాత శైవ క్షేత్రం.. వేలాది భక్తులు సందర్శించే ప్రాంతం.. అలాంటి ప్రదేశంపై ఓ సాధారణ శానిటరీ వర్కర్ ఆరోపణలు చేశాడు.. ఏమో..? అందులో నిజం ఉందని... లేదని చెప్పలేం కదా..?! శానిటరీ వర్కర్ ముసుగు ధరించి మరీ ఆరోపణలు చేయడంతో నెల రోజులకు పైగా రాద్ధాంతం..! చివరకు ప్రభుత్వమే కదిలి విచారణకు ఆదేశించింది. అతడు చెప్పినది వాస్తవమే అయితే ఎంత గగ్గోలు రేగేదో...?
భీమా హైడ్రామా
కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రఖ్యాత శైవ క్షేత్రం ధర్మస్థల. గతంలో ఇక్కడ శానిటరీ వర్కర్ గా పనిచేసి వెళ్లిపోయాడు భీమా. 1998-2014 మధ్య తాను అనేకమంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను పూడ్చిపెట్టానంటూ అతడు ఆరోపణలు చేశాడు. వీరంతా లైంగిక దాడి బాధితులను కూడా అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలోనే కాక దేశమంతా సంచలనం రేపాయి. మరి ఇన్నాళ్ల తర్వాత ఎందుకు బయట పెట్టావని ప్రశ్నించగా.. 2014 డిసెంబరులో తమ కుటుంబంలోని యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో అండర్ గ్రౌండ్ కు వెళ్లినట్లు చెప్పాడు. ఇప్పుడు పశ్చాత్తాపంతో బయటకు వచ్చానని తెలిపాడు. ముసుగు వేసుకుని ఆరోపణలు చేయడంతో అతడిని ముసుగు వ్యక్తిగా పిలవసాగారు.
అంతా హంబక్...
ధర్మస్థల కేసు ఇప్పుడు వేరొక మలుపు తిరిగింది... ఆరోపణలు చేసిన భీమాని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో తాను చాలా మృతదేహాలను పూడ్చి పెట్టానంటూ ఆరోపణలు చేసిన భీమా ప్రజలను తప్పుదోవ పట్టించాడంటూ తేలింది. తొలుత వందకు పైగా మృతదేహాలను తానే ఖననం చేశానని చెప్పిన భీమా తర్వాత మాట మార్చాడు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వం, ప్రజలను తప్పుదారి పట్టించినందుకు అతడిని అరెస్టు చేశారు.
రాత్రంతా విచారణ....
భీమాను సిట్ అధికారి ప్రణబ్ మొహంతీ శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విచారించారు. అతడు కట్టుకథలు అల్లి అందరినీ మోసిగించాడని సిట్ తేల్చింది. శనివారం అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఇక ధర్మస్థల కేసులో బెంగళూరుకు చెందిన సుజాత భట్ కూడా తప్పుడు ఆరోపణలు చేసింది. మెడిసిన్ చదువుతున్న తన కుమార్తె 2003లో ధర్మస్థలకు వెళ్లి తిరిగిరాలేదంటూ సుజాత చెప్పినందంతా కట్టుకథేనని తేలింది. తాను చెప్పినది అంతా తప్పని సుజాత ఒప్పుకొంది. దీంతో ఈమెనూ అరెస్టు చేశారని సమాచారం.
భీమా ముసుగు తొలగించిన పోలీసులు అతడి పేరు సీఎన్ అలియాస్ చిన్నా అని రివీల్ చేశారు. చిన్నా ఫొటోను కూడా విడుదల చేశారు.