వైసీపీ పెద్దాయనకు రెండు టికెట్లు కావాలంట ?

ఇక చూస్తే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే చాలా కాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఆయనను కదిలించాలని ఎంత మంది చూసినా కూడా ఏమీ చేయలేకపోయారు.;

Update: 2025-12-14 03:54 GMT

వైసీపీలో ఇపుడు మెల్లగా ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. తమ గొంతుని మీడియా ముందు గట్టిగా విప్పుతున్నారు. ఏణ్ణర్థం కాలం గడచిపోయింది చివరి ఏణ్ణర్థం ఎన్నికల కోసం వదిలేస్తే ఇక మిగిలింది రెండేళ్ళు కాబట్టి ఇప్పటి నుంచే జనంలో ఉండాలని భావిస్తున్నారని అంటున్నారు. దాని కంటే ముందు మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడడం ద్వారా అధినేత మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ధర్మాన సోదరులకే పెద్ద పీట అన్నది తెలిసిందే. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, క్రిష్ణదాస్ లేకుండా వైసీపీ అన్నదే లేదు అని అంటారు. అందుకే వారికి అంతగా ప్రయారిటీ కూడా పార్టీలో ఉంది.

సైలెంట్ నుంచి బిగ్ సౌండ్ :

ఇక చూస్తే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే చాలా కాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఆయనను కదిలించాలని ఎంత మంది చూసినా కూడా ఏమీ చేయలేకపోయారు. ఆయన అప్పట్లో వేరే ఆలోచనలు చేస్తున్నారు అని కూడా టాక్ నడచింది. ఇక శ్రీకాకుళం అసెంబ్లీ సీటు కి వేరే ఇంచార్జిని నియమిస్తారని కూడా ఒక దశలో ప్రచారం కూడా జరిగింది. అయితే వైసీపీ హైకమాండ్ ప్రసాదరావుకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఆయన మళ్ళీ క్రియాశీలకం కావాలని కోరుతూ వచ్చింది. దాంతో ఇటీవల కాలంలో ప్రసాదరావు మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి బిగ్ సౌండ్ చేశారు.

జగన్ గ్రేట్ అంటూ :

జగన్ పాలన భేష్ అని ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాకనే భూ సర్వేని పకడ్బందీగా ఏపీ అంతటా చేపట్టారని పేదల భూములకు హక్కులు కల్పించింది జగన్ మాత్రమే అన్నారు అలాంటిది ఆయన మీద నిందలు వేసి కూటమి అధికారంలోకి వచ్చిందని ధర్మాన విమర్శించారు. రెవిన్యూ లో అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత అయితే జగన్ దే అని చెప్పారు. ఈ విషయంలో డిబేట్ కి కూడా తాను కూటమి నేతలతో రెడీ అన్నారు.

పోటీకి రెడీనా :

ఇదిలా ఉంటే ధర్మాన ప్రసాదరావు వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు అని అంటున్నారు. ఆయన ఈసారి శ్రీకాకుళం ఎంపీ సీటుకు పోటీ చేస్తారు అని వినిపిస్తోంది. తన కుమారుడిని శ్రీకాకుళం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఆ విధంగా రెండు టికెట్లను ఆయన ఆశిస్తున్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా పలు కీలక శాఖలను చూసిన ప్రసాదరావుకు పార్లమెంట్ లో కూడా అడుగుపెట్టాలని కోరిక ఉందని చెబుతున్నారు. దానిని వచ్చే ఎన్నికల్లో తీర్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. వైసీపీకి శ్రీకాకుళం ఎంపీ సీటుకు అభ్యర్ధి కావాల్సి ఉంది. ప్రతీ ఎన్నికల్లోనూ మిస్ ఫైర్ అవుతోంది. దాంతో బలమైన నేతగా అనుభవం ఉన్న వారిగా ప్రసాదరావు వస్తే కనుక కచ్చితంగా వైసీపీకి అభ్యంతరం ఉండకపోవచ్చు, మరి రెండు టికెట్లు అయితే ఆ ఫ్యామిలీకి ఇస్తారా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా ప్రసాదరావు మళ్ళీ ఫుల్ యాక్టీవ్ కావడం పట్ల క్యాడర్ అయితే హుషార్ గా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News