దాసన్న పరిత్యాగం వైసీపీకి షాకేనా ?

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఓద్ద దిక్కుగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ఆయనది పాతికేళ్ళకు పైబడిన రాజకీయం.;

Update: 2025-10-09 03:59 GMT

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఓద్ద దిక్కుగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ఆయనది పాతికేళ్ళకు పైబడిన రాజకీయం. పూర్వాశ్రమంలో డ్రిల్ మాస్టర్ గా ఆయన విధులను నిర్వహించారు. తన తమ్ముడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గెలుపునకు తెర వెనక కృషి చేస్తూ జిల్లాలోని నరసన్నపేటలో పట్టు సాధించారు. ఇక వైఎస్సార్ పిలుపుని అందుకుని 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో ప్రసాదరావు శ్రీకాకుళానికి షిఫ్ట్ అయి అక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అలా అన్నదమ్ములు సీట్లను ఎంచుకుని పంచుకుని మరీ రాజకీయంగా రాణిస్తూ వచ్చారు.

ట్రాక్ రికార్డు గట్టిగానే :

ఇదిలా ఉంటే ధర్మాన క్రిష్ణదాస్ పొలిటికల్ ట్రాక్ రికార్డు గట్టిగానే ఉంది. లేట్ గా వచ్చినా తమ్ముడితో పాటుగా ధీటుగానే రాణించారు కాంగ్రెస్ తరఫున రెండు సాల్రు గెలిచిన ఆయన వైసీపీ తరఫున మరో రెండు సార్లు గెలిచారు మొత్తం ఆరు సార్లు పోటీ చేస్తే నాలుగు సార్లు గెలుపు అంటే రాజకీయంగా బాగానే విజయవంతం అయ్యారు అని అంటున్నారు. అందులో కూడా ఏకంగా మూడేళ్ళ పాటు ఉప ముఖ్యమంత్రిగా జగన్ ప్రభుత్వంలో ఉంటూ కీలకమైన రెవిన్యూ శాఖను కూడా చేపట్టారు అని గుర్తు చేస్తున్నారు.

కుమారుడి కోసం :

ఇదిలా ఉంటే తన కుమారుడి కోసం క్రిష్ణ దాస్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని అంటున్నారు. ఆయన కుమారుడు డాక్టర్ క్రిష్ణ చైతన్య ఇప్పటికే జెడ్పీటీసీ మెంబర్ గా ఉన్నారు ఆయన 2029 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసన్నపేట నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇప్పటికే పార్టీ నేతలకు క్యాడర్ కి దాసన్న ఇదే విషయం చెప్పేశారు అని అంటున్నారు. తన కుమారుడే ఇక మీదట నియోజకవర్గం పార్టీని చూస్తారని ఆయనతోనే అన్నీ అని వారికి క్లారిటీ ఇచ్చేశారు అని అంటున్నారు.

పార్టీ బాధ్యతల మీద :

మరో వైపు క్రిష్ణదాస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జగన్ కి ఆయన మీద ఎంతో గురి ఉంది. కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చినపుడు ఆయన వెంట నడిచిన వారిలో దాసన్న ఉత్తరాంధ్ర నుంచి మొదటి స్థానంలో ఉన్నారు. అంతే కాదు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ గెలిచి వచ్చారు. అందుకే జగన్ ఆయనను గుర్తు పెట్టుకుని మరీ ఉప ముఖ్యమంత్రిగా తొలి విడతలోనే చాన్స్ ఇచ్చారని అంటున్నారు. దాసన్న కూడా జగన్ కోసమే ఏడు పదుల వయసులో పార్టీ బాధ్యతలు మోస్తున్నారు అని అంటున్నారు అయితే వయో భారం తో పాటు రాజకీయంగా విరామం కోరుకుంటూ తప్పుకోవాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. మరి జగన్ దీనిని అంగీకరిస్తారా అన్నది చూడాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఫ్యామిలీతో పాటుగా ధర్మాన ఫ్యామిలీకి రాజకీయంగా మంచి పలుకుబడి గుర్తింపు ఉన్నాయి. రెండు కుటుంబాలు చెరో పార్టీలో ఉంటూ రాజకీయాలు పోటాపోటీగా చేస్తూ వచ్చాయి. ఇపుడు క్రిష్ణదాస్ రాజకీయ పరిత్యాగం చేస్తామని అంటే అది వైసీపీకి భారీ షాక్ గానే ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News