ఇద్దరి ప్రాణాలు తీసిన దేవరగట్టు దసరా వేడుకలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని ఒక ప్రాచీన సంస్క్రతికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో నిర్వహించే బన్నీ ఉత్సవం;
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని ఒక ప్రాచీన సంస్క్రతికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో నిర్వహించే బన్నీ ఉత్సవం. కర్రల సమరంగా పేర్కొనే ఈ ఉత్సవాన్ని దసరా సందర్భంగా నిర్వహిస్తారు. దసరా వేళ అర్థరాత్రి సమయంలో దేవరగట్టులోని స్వామి.. అమ్మవారి (మాళ మల్లేశ్వరస్వామి, అమ్మవారు) వివాహం తర్వాత ఊరేగింపు జరుగుతుంది. ఈ సందర్భంగా దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు తలపడతాయి.
కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవానికి వేదికగా మారుతుంది. దేవతా మూర్తుల కోసం రెండు వర్గాలు తలపడతాయి. ఈ సందర్భంగా పొడవాటి కర్రలతో బన్నీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. నిజానికి ఈ కర్రల సమరం లయబద్ధంగా సాగే ఒక అందమైన ఆర్ట్ ఫాంలా ఉండాలి.కానీ.. వ్యక్తిగత కక్షలు.. మద్యం సేవించి ఉండటం కారణంగా అసలు అంశం పక్కకు వెళ్లిపోయి... ప్రతి ఏడాది భక్తులు గాయాలబారిన పడటం.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవటం లాంటి విషాద ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
ఈసారి బన్నీ ఉత్సవ వేళ.. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయపడ్డారు.వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించేందుకు ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. మరోవైపు దేవరగట్టులో ఉత్సవాలు కంటిన్యూ అవుతున్నాయి. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికి.. ఈ ప్రాచీన గ్రామీణ ఉత్సవాన్ని పరిరక్షించాలని ఉమ్మడి రాష్ట్రంలో నియమించిన చెల్లప్ప కమిషన్ నిర్ణయించింది. అయితే.. ఈ ఉత్సవంలో పాల్గొనే భక్తులు మద్యం సేవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. పోలీసులు ఎంతగా ప్రయత్నించినా.. కొందరు అత్యుత్సాహంతో మద్యాన్ని సేవించి కర్రల సమరం (బన్నీ ఉత్సవం)లో పాల్గొనటమే ఈ హింసకు.. రక్తపాతానికి కారణంగా చెప్పక తప్పదు.