టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు... వీడియో వైరల్!

అవును... డెన్వర్‌ విమానాశ్రయంలో అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ బోయింగ్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది.;

Update: 2025-07-28 06:41 GMT

టెకాఫ్ అవుతున్నప్పుడు, ల్యాండింగ్ సమయంలోనూ పలు విమానాలు ఎదుర్కొంటున్న సమస్యల ఘటనల్లో తాజాగా మరో ఘటన వచ్చి చేరింది. ఇందులో భాగంగా... డెన్వర్ నుంచి మయామి వెళ్లే విమానం టెకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా.. ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక సమస్య కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో... టెకాఫ్ ప్రక్రియను నిలిపివేశారు.

అవును... డెన్వర్‌ విమానాశ్రయంలో అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ బోయింగ్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇందులో భాగంగా... టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమవుతుండగా ల్యాండింగ్‌ గేర్‌ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో... ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో.. వారిని గాలితో నింపిన జారుడుబల్ల ద్వారా కిందకు దిగారు.

ఈ సందర్భంగా స్పందించిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.ఏ.ఏ).. విమానం బయలుదేరే సమయంలో ల్యాండింగ్ గేర్ వైఫల్యం సంభవించిందని నివేదించింది. దీంతో టేకాఫ్‌ ను నిలిపివేయవలసి వచ్చిందని.. ఆ సమయంలో గాలితో నిండిన ఎమర్జెన్సీ స్లయిడ్‌ లను ఉపయోగించి ప్రయాణీకులను కిందకు దింపారని.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.

అలా ఎమర్జెన్సీ స్లయిడ్ నుంచి కిందకు వెళ్తున్న సమయంలో కొందరు కిందపడిపోగా.. మరికొంతమంది రన్‌ వేపై పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఈ సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని ఎఫ్.ఏ.ఏ. వెల్లడించింది.

ఈ సందర్భంగా పలువురు స్వల్పంగా గాయపడగా... వారికి ప్రథమచికిత్స అందించినట్లు ఎఫ్.ఏ.ఏ. తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొంది. ఈ సంఘటన తర్వాత బోయింగ్ విమానాన్ని తనిఖీ చేస్తున్నట్లు అమెరికన్ ఎయిర్‌ లైన్స్ ధృవీకరించింది.

Tags:    

Similar News