కారు డ్రైవరే కాలయముడైన వేళ... ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య!
అవును... తన ఇంటి బయట ఆడుకుంటూ కనిపించిన ఐదేళ్ల బాలుడు, కాసేపటి తర్వాత అదృశ్యమయ్యాడు.;
ఎవరిని నమ్మాలి, మరెవరిని నమ్మకూడదు..? ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి సైతం అపనమ్మకస్తుడిగా మారి, ఆ ఇంటి బిడ్డనే అపహరించి హత్య చేసిన ఘటన తాజాగా తీవ్ర కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీలోని నరేలాలో జరిగిన ఈ విషాద సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
అవును... తన ఇంటి బయట ఆడుకుంటూ కనిపించిన ఐదేళ్ల బాలుడు, కాసేపటి తర్వాత అదృశ్యమయ్యాడు. అయితే.. కొన్ని గంటల తర్వాత అతని మృతదేహం.. అతని తండ్రి కారు డ్రైవర్ గదిలో కనిపించింది. ప్రతీకార హత్యగా భావించి హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని నీతూగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం నరేలాలోని తన ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో... మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నరేలా పారిశ్రామిక ప్రాంతంలో అనుమానిత కిడ్నాప్ కు సంబంధించిన కాల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఆ సమయంలో అసలు విషయం వెలుగు చూసింది!
ఇందులో భాగంగా... అదే ప్రాంతంలో నివసించే నీతు అనే డ్రైవర్ అద్దెకు తీసుకున్న గదిలో ఆ పిల్లవాడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీతో... ఆ బాలుడిని వెంటనె సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో పిల్లవాడిని ఇటుకలు, కత్తితో కొట్టి చంపినట్లు తేలిందని అన్నారు.
హత్యకు ఇదేనా కారణం?:
ఈ సందర్భంగా స్పందించిన ఓ పోలీసు అధికారి... సోమవారం తాగిన మత్తులో మరొక డ్రైవర్ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు నీతుని అతని యజమాని మందలించి, చెంపదెబ్బ కొట్టాడని చెబుతున్నారు. దీంతో యజమానిపై ఆగ్రహంగా ఉన్న నీతూ.. ఆ బాలుడిని తన ఇంటి బయట నుంచి కిడ్నాప్ చేసి తన గదికి తీసుకెళ్లి, అక్కడ హత్య చేసినట్లు తెలుస్తోందని.. ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు!
ఈ నేపథ్యంలో... నరేలా పోలీస్ స్టేషన్ లో హత్య, కిడ్నాప్ సహా భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.