ఆ అంకుల్ బూచాడు చచ్చేవరకు బయటకు రాడు.. కదిలిస్తున్న జడ్జి లేఖ
2023 జులై 23న ఏడేళ్ల బాలికపై ఒకడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించగా కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద అతడ్ని జైలుకు నెట్టాడు.
చిన్నారికి ప్రత్యేకంగా లేఖ రాసిన ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ఉదంతం ఇప్పుడు అందరిని కదిలిస్తుంది. సున్నితమైన అంశంలో ఏడేళ్ల వయసులో దారుణంగా గాయపడిన ఆ చిన్నారి మనసుకు ఊరటనిస్తూ.. ఆమె ధైర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ రాసిన ఈ లేఖలోని ప్రతి మాట ఇప్పుడు దేశ ప్రజల్ని టచ్ చేస్తున్నాయి. దేశ న్యాయరంగ చరిత్రలో తొలిసారి (కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం) లైంగిక దాడికి గురైన చిన్నారికి న్యాయమూర్తి తన తీర్పులో భాగంగా ప్రత్యేకంగా లేఖ రాయటం.. అందులోని అంశాలు ఒక ప్రముఖ టీవీ చానల్ ప్రత్యేకంగా కవర్ చేయటంతో ఈ ఉదంతం ఇప్పుడు తెలిసే పరిస్థితి. ఇంతకూ అసలేమైంది? న్యాయమూర్తి లేఖలో ఏముందన్న వివరాల్లోకి వెళితే..
2023 జులై 23న ఏడేళ్ల బాలికపై ఒకడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించగా కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద అతడ్ని జైలుకు నెట్టారు. విచారణలో భాగంగా ఈ కేసు ట్రయల్ కోర్టు అదనపు సెషన్స్ న్యాయమూర్తి రజని రంగా అతడికి జీవితాంతం కఠిన యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.లక్ష ఫైన్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్, జస్టిస్ దినేష్ భట్ లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నిందితుడి అభ్యర్థనను రిజెక్టు చేస్తూ అతడికి శిక్షను ఖరారు చేసింది.
ట్రయల్ కోర్టు 2026 మే 20న దోషిగా నిర్దారించగా.. జులై 11న శిక్షను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు ఈ తీర్పుపై హైకోర్టుకు అప్పీలుకు వెళ్లగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 2026 సెప్టెంబరు 22న తుది ఉత్తర్వులను జారీ చేశారు. ట్రయల్ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధిస్తూ ఇచ్చిన అధికారిక తీర్పు కాపీ చివర్లో హైకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ఒక లేఖను ప్రత్యేక నోట్ గా పొందుపరిచారు. ఈ లేఖను బాధితురాలికి రెండు వారాల గడువులోపు అందజేయాలని ఆదేశించారు.
తాము పంపిన లేఖ బాధిత చిన్నారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని హైకోర్టు భావించింది. తీర్పులోని సందేశాన్ని ప్రత్యేకంగా ప్రింట్ చేసి బాలికకు కానీ వారి కుటుంబానికి కూడా అధికారికంగా అందజేయాలని ఆదేశించింది. ఇందులో పేర్కొన్న అంశాలు ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకూ ఆ లేఖలో ఏముందంటే..
డియర్ చైల్డ్..
నువ్వు ‘అంకుల్’ అని పిలిచే ఆ వ్యక్తి ఇకపై ఎన్నటికీ బయటకు రాకూడదని ఈ రోజు ఈ కోర్టు ఆదేశించింది. అతడు ఆ బోనులోనే ముసలివాడవుతాడు. ఆ బోనులోనే మరణిస్తాడు. అతను నిన్ను కానీ.. నీ చెల్లిని కానీ.. మరే చిన్నారిని కానీ ఇంకెప్పుడూ గాయపరచలేడు. ఈ కోర్టు చూసిన అత్యంత ధైర్యవంతురాలైన చిన్నారివి నువ్వే. నువ్వు కోర్టుకు వచ్చావు. నిన్ను బాధ పెట్టిన వ్యక్తి వైపు వేలు చూపిస్తూ నిజం చెప్పావు. అతను నీకు చాలా చెడు చేశాడు. కానీ.. నువ్వు మౌనంగా ఉండలేదు.
మీ అమ్మకు చెప్పావు. నీ ధైర్యంతోనే అతను మరో చిన్నారికి అన్యాయం చేయలేడు. ఈ న్యాయస్థానం నీ బాల్యాన్ని నీకు తిరిగి ఇవ్వలేదు. కానీ.. నీ మాటలను కోర్టు విన్నదని.. నీ కోరికను నెరవేర్చిందని నీకు మాట ఇస్తున్నాను. నిన్ను బాధ పెట్టిన వ్యక్తి ఇకపై ఎన్నటికీ స్వేచ్చగా తిరగలేడు. తల్లీ.. ఇకపై నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించు. స్కూల్ కు వెళ్లు. స్నేహితుల్ని చేసుకో. ఆడుకో. నవ్వు.. నువ్వు నీ కలల్ని సాకారం చేసుకో. ఈ కోర్టు నీ ధైర్యాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది’ అంటూ లేఖను ముగించారు.
కోర్టు అధికారిక తీర్పు కాపీలోనే ఈ లేఖను పొందుపర్చటం.. దీన్ని తొలుత ఎన్డీటీవీ టెలికాస్ట్ చేసింది. బాధితురాలికి న్యాయమూర్తి రాసిన అత్యంత సున్నితమైన లేఖను తన వార్తా కథనంలో హైలెట్ చేసింది. ఈ కథనం వైరల్ కావటంతో ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ ప్రెస్..హిందుస్థాన్ టైమ్స్ లాంటి ప్రముఖ మీడియా సంస్థలు ఈ అసాధారణ తీర్పును.. బాలిక ధైర్యాన్ని కొనియాడుతూ జడ్జి రాసిన లేఖను పబ్లిష్ చేశాయి.
ఒక చిన్నారి మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు చట్టపరమైన పరిభాషను పక్కన పెట్టేసి.. భావోద్వేగం.. అత్యంత సున్నితంగా లేఖ రాయటం భారత న్యాయ చరిత్రలో అరుదైన అంశంగా చెబుతున్నారు. దారుణానికి గురైన బాలికకు స్వాంతన కలిగేలా శిక్ష వేయటమే కాదు.. ఆమెకు ధైర్యాన్ని కలుగజేస్తూ.. న్యాయవ్యవస్థ నీకు తోడు ఉంది తల్లీ అన్న సందేశాన్ని ఇస్తూ రాసిన ఈ లేఖ ప్రజల మనసుల్ని దోచుకుందని చెప్పాలి.