జగన్ రెడ్డినే అనుసరిస్తున్న విజయసాయిరెడ్డి.. పార్టీ పేరుపై ఇంకా సస్పెన్స్
ప్రజల్లో ఆదరణ కోసం పాదయాత్ర చేస్తానని చెప్పడమే కాకుండా, జగన్మోహనరెడ్డి ఏ విధంగా ప్రెస్ మీటు నిర్వహిస్తారో విజయసాయిరెడ్డి కూడా అదేవిధంగా మీడియాతో మాట్లాడుతున్నారని అంటున్నారు.
వైసీపీకి రాజీనామా చేసి సొంతంగా పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. పార్టీ ప్రారంభానికి ముందు తన విధివిధానాలను మీడియా ముఖంగా వెల్లడిస్తున్న మాజీ ఎంపీ ఇప్పటివరకు పార్టీ పేరు మాత్రం రివీల్ చేయలేదు. ఇదే సమయంలో తన మాజీ బాస్ జగన్మోహనరెడ్డి మాదిరిగానే రాజకీయాల్లో తాను సక్సెస్ అవ్వాలని భారీ ప్లాన్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి. ప్రజల్లో ఆదరణ కోసం పాదయాత్ర చేస్తానని చెప్పడమే కాకుండా, జగన్మోహనరెడ్డి ఏ విధంగా ప్రెస్ మీటు నిర్వహిస్తారో విజయసాయిరెడ్డి కూడా అదేవిధంగా మీడియాతో మాట్లాడుతున్నారని అంటున్నారు.
పార్టీ ప్రారంభానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం విశాఖలో పర్యటించారు. ఆయన వైసీపీలో పనిచేసిన సమయంలో సుదీర్ఘకాలం విశాఖ కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన సొంత పార్టీ పెట్టుకుంటుండటంతో వైసీపీ నేతలు ఎవరూ విజయసాయిరెడ్డిని కలిసేందుకు ఆసక్తి చూపలేదని అంటున్నారు. దీంతో ఆయన ఒక్కరే మీడియాతో మాట్లాడారు. ఇక పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తన మాజీ బాస్ జగన్మోహనరెడ్డి సైతం వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ప్రకటించగా, ఆయనకు పోటీగా తాను కూడా పాదయాత్ర చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికార టీడీపీతోపాటు విపక్షం వైసీపీపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు కుటుంబ పార్టీలు పనిచేస్తున్నాయని, ఆ రెండు పార్టీలు రాష్ట్ర విభజన సమస్యలపై మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పార్టీలకు ఓటేయాలో వద్దో ఆలోచించుకోవాలని అన్నారు.
ఇక తన పార్టీ యువత కోసమే ఏర్పాటు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పార్టీకి ఓటేయాలా, రప్పా, రప్పా పార్టీకి ఓటేయాలా అనేది యువతే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. రెండు పార్టీల్లో ఒకటి కుల పిచ్చితోను మరొకటి మత పిచ్చితోను పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలను ఓడించాలని యువతరానికి పిలుపునిచ్చారు. యువతరం నుంచే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అవ్వాలని వ్యాఖ్యానించారు. తన పార్టీ అధికారంలోకి వస్తే ఇంతవరకు అధికారం అనుభవించని వర్గాల వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. ఇక విశాఖలో ఆంధ్ర వర్సిటీని నిర్వీర్యం చేసి గీతం యూనివర్సిటీకి మేలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు.