పవర్ గ్రిడ్ పై ఎల్ నినో ఎఫెక్ట్ !
ఏకంగా ఈ సీజన్ లో 19,543 మెగావాట్ల పీక్ డిమాండ్ పెరగడం పరిస్థితికి నిదర్శనం. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ బోర్ల లోడ్ దాదాపు 6,500 నుండి 7 వేల మెగావాట్లకు పెరిగింది.
ఎల్ నినో ఇప్పుడు తెలంగాణ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని వణికిస్తున్న సమస్య. ఎల్ నినో మూలంగా తెలంగాణలో 25 శాతం వరకు వర్షపాతం తగ్గింది. దీని ప్రభావం మూలంగా భూగర్భ జలాలు తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీనివల్ల పరోక్షంగా అనేక రంగాల మీద విద్యుత్ సరఫరా విషయంలో భారం పెరిగింది.
ఏకంగా ఈ సీజన్ లో 19,543 మెగావాట్ల పీక్ డిమాండ్ పెరగడం పరిస్థితికి నిదర్శనం. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ బోర్ల లోడ్ దాదాపు 6,500 నుండి 7 వేల మెగావాట్లకు పెరిగింది. నీటి లభ్యత లేకపోవడం వలన 2 వేల మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. వాస్తవానికి మాన్ సూన్ పీక్ డిమాండ్ 11 వేల మెగావాట్లు ఉండగా అది 16,500 దాటి 19,543 మెగావాట్లకు చేరింది.
ఎల్ నినో మూలంగా వర్షాలు తగ్గడంతో పవర్ ఎక్స్ఛేంజ్ ధర యూనిట్ రూ.7.9 నుండి రూ.10కి చేరింది. తెలంగాణ విద్యుత్ కెపాసిటీ 23 వేల నుండి 24,500 మెగావాట్లు ఉంది. థర్మల్ పవర్ 12 వేల మెగావాట్లు, హైడెల్ పవర్ 2500 మెగావాట్లు, సోలార్ 8 వేల మెగావాట్లు ఉన్నా హైడెల్ ఉత్పత్తి లేకపోవడంతో ఇతర మార్గాల మీద ఆధారపడాల్సి వస్తోంది. బొగ్గు సరఫరా లేకపోవడం థర్మల్ పవర్ ప్లాంట్లకు ఇబ్బందికరంగా మారింది.
హైడెల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో థర్మల్ ప్లాంట్లయిన యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో నడపాల్సి వస్తోంది. బొగ్గు సరఫరాతో పాటుగా నాణ్యత సమస్యల మూలంగా ఉత్పత్తిలో స్థిరత్వం తగ్గింది.
మాన్ సూన్ డిమాండ్ కు మించి వేసవి స్థాయి డిమాండ్ ఉండడంతో ఉత్పత్తి సామర్థ్యం మరియు సరఫరా మీద ఒత్తిడి పెరుగుతోంది. హైడెల్ ఉత్పత్తి తగ్గడం ప్రధానంగా విద్యుత్ రంగం మీద ప్రభావం చూపుతోంది.