మధించినా చుక్క వాన బొట్టు లేదుగా !

ప్రకృతిని నిలువరించడం ఎవరి తరం. అది భూగోళాన్ని మించి అండ పిండ బ్రహ్మాడాలను ఆవరించి ఉంది.;

Update: 2025-10-29 11:30 GMT

ప్రకృతిని నిలువరించడం ఎవరి తరం. అది భూగోళాన్ని మించి అండ పిండ బ్రహ్మాడాలను ఆవరించి ఉంది. దానికి శక్తి అని శాస్త్రం అన్నా భక్తిగా ఆస్తికత కొలిచినా సూపర్ పవర్ మాత్రం ఉంది అన్నది అంతా అంగీకరించే విషయం. మానవుడు తన మేధస్సులో సాంకేతికంగా అభివృద్ధి చెందాడు. కానీ అదే సమయంలో ప్రకృతిని దారికి తెచ్చుకుందామంటే అది వల్ల అయ్యే పని కానే కాదు అని అనేక సందర్భాలలో రుజువు అయింది.

కృత్రిమ వానలతో :

వానలు ఎలా కురుస్తాయి అంటే మేఘాల విచ్చేదనంతో అని జవాబు చెబుతారు. ఆ మేఘాలను మధిస్తే వానలు పడతాయి అన్నది ఒక టెక్నాలజీ. దానినే క్లౌడ్ సీడింగ్ గా ప్రయోగాలు చేస్తారు. ఎక్కడైతే వానలు కురవవో మేఘాల మీద ప్రయోగాలు చేసి వానలు కురిసేలా చేయాలన్నది ఒక ఆలోచన. అయితే ఇది కొన్ని సార్లు ఫలిస్తుంది, మరి కొన్ని సార్లు ఫెయిల్ అవుతుంది ఢిల్లీలో చూస్తే క్లౌడ్ సీడింగ్ కోసం చేసిన తాజా ప్రయత్నం అయితే విఫలం అయింది.

కాలుష్యానికి జవాబుగా :

ఢిల్లీని కాలుష్యం పట్టి పీడిస్తోంది. శీతాకాలం అది మరింతగా పెరిగిపోతుంది. గతసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువగా ఉంది. దాంతో జనాలు అంతా నానా రకలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే వర్షాలు కురియాలి. అవి ఎపుడు కావలిస్తే అపుడు పడవు కాబట్టే కృత్రిమంగా కురిపించేందుకు సిద్ధపడింది ప్రభుత్వం ఏకంగా విమానాల ద్వారా పైకి వెళ్ళి సిల్వర్ అయోడైడ్ చల్లి క్లౌడ్ సీడింగ్ కి రంగం సిద్ధం చేశారు. కానీ ఒక్క చుక్క నీటి బొట్టు కూడా నేలకు జారలేదు అని అంటున్నారు.

తేమ అధికంగా ఉందిట :

మంగళవారం చేపట్టిన ఈ ప్రయోగం విఫలం కావడానికి మేఘాలలో తేమ అధికంగా ఉండడమే కారణం అని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మణీంధ్ర అగర్వాల్ చెబుతున్నారు. అలాంటి సమయాల్లో ఫలితాలు ఇవ్వదని ఆయన ఆంటున్నారు. అయితే ప్రభుత్వం మేఘ మధనం కోసం మంగళవారం మేఘాలలో 14 మంటలను పేల్చినట్లుగా చెబుతున్నారు. ఇక బుధవారం కూడా మరోసారి క్లౌడ్ సీడింగ్ ప్రయోగం నిర్వహించనున్నారు.

కోట్లతో వ్యవహారం :

చుక్క వాన నీటి కోసం కోట్లలోనే ఢిల్లీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ కృత్రిమ వర్షాలను తెచ్చేందుకు నిర్వహించిన ప్రాజెక్ట్ ఖర్చు అక్షరాల మూడు కోట్ల 21 లక్షలుగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ని పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ భారత వాతావరణ శాఖ నిపుణుల సహకారంతో నిర్వహిస్తోంది. అయినా ఒక్క నీటి చుక్క అయితే దక్కడం లేదు. చిత్రమేంటి అంటే అదే సమయంలో దేశంలో ఏపీ సహా అనేక రాష్ట్రాలలో తుఫాన్ ప్రభావంతో భారీ ఎత్తున వానలు కురుస్తున్నాయి. జల ప్రళయమే అనేక చోట్ల కనిపిస్తోంది. కానీ వాన చుక్క కోసం అల్లాడుతున్న ఢిల్లీలో మాత్రం మేఘాలను మధించినా నీరు చిందడంలేదు. అందుకే ప్రకృతి ఎపుడూ ప్రకృతే అని అంటున్నారు.

Tags:    

Similar News