ఇది టాక్సీనా లేక విమానమా? .. ఈ డ్రైవర్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!

అబ్దుల్ క్యాబ్‌లో ఎక్కితే ప్రయాణం ఒక ఎత్తైతే, లోపల ఉండే సౌకర్యాలు మరో ఎత్తు.;

Update: 2025-04-30 13:30 GMT

ఈ రోజుల్లో జనాలు ఒకరినొకరు ద్వేషించుకుంటూ, భయపడుకుంటూ ఉంటున్నారు. కానీ ఢిల్లీలో అబ్దుల్ ఖాదీర్ అనే ఒక టాక్సీ డ్రైవర్ మాత్రం చిన్న చిన్న మంచి పనులు చేస్తే కూడా జనాలు ఎలా కలిసి ఉంటారో చూపిస్తున్నాడు. తన క్యాబ్‌లో ఎక్కిన వాళ్లకు మంచి అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు చేశాడు.. దీంతో ఇప్పుడు కాబట్టే సోషల్ మీడియాలో అందరూ అతడి గురించే మాట్లాడుకుంటున్నారు.

అబ్దుల్ క్యాబ్‌లో ఎక్కితే ప్రయాణం ఒక ఎత్తైతే, లోపల ఉండే సౌకర్యాలు మరో ఎత్తు. అక్కడ ఉచితంగా తినడానికి స్నాక్స్, తాగడానికి నీళ్లు, వైఫై, టిష్యూ పేపర్లు, శానిటైజర్, కొన్ని మందులు, చిన్న విసనకర్రలు, మంచి సెంటులు, పొగ తాగేవాళ్ల కోసం యాష్‌ట్రేలు కూడా ఉన్నాయి. అన్నీ చాలా నీట్‌గా, ఒక పద్ధతి ప్రకారం పెట్టి, రూపాయి ఎక్కువ తీసుకోకుండా ప్రేమగా అందజేస్తున్నాడు. అంతేకాదు, క్యాబ్‌లో ఒక చిన్న బోర్డు కూడా పెట్టాడు. దాని మీద "మనం అందరి మతాల వాళ్లను గౌరవిస్తాం. బట్టలు చూసి ఎవరి మతం ఏమిటో చెప్పలేం. దయచేసి అందరూ ఒకరితో ఒకరు మర్యాదగా ఉండండి. సమాజానికి మంచి చేసే పనుల నుంచి మనం స్ఫూర్తి పొందాలి - అబ్దుల్ ఖాదీర్" అని రాసి ఉంది.

అతడి క్యాబ్‌లో ప్రయాణించిన ఒక రెడ్డిట్ యూజర్ "ఇది ఫ్లైట్‌లో కంటే బాగుంది" అంటూ కితాబిచ్చాడు. చాలా మంది ఆన్‌లైన్‌లో అబ్దుల్‌ను అతని మంచి మనసుకు, చేసే పనికి మెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే మళ్లీ అతడి క్యాబ్‌లోనే వెళ్లాలని ఉంది అంటున్నారు. అతడి సర్వీస్‌ను అతిథి మర్యాదకు అసలైన ఉదాహరణ అని పొగిడేస్తున్నారు. మతం పేరుతో దేశాన్ని విడగొట్టాలని టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో అబ్దుల్ ఖాదీర్ లాంటి మనుషులు మానవత్వం, ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో చూపిస్తున్నాడు.

Tags:    

Similar News