ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అసలేం జరిగింది.. షాకింగ్ విషయం చెప్పిన ఏటీసీ గిల్డ్!
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 800 విమానాల రాకపోకలు ఆలస్యమయిన సంగతి తెలిసిందే.;
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 800 విమానాల రాకపోకలు ఆలస్యమయిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమాన ప్లాన్స్ రూపొందించే కీలకమైన కమ్యూనికేషన్ నెట్ వర్క్ 'ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్' (ఏఎంఎస్ఎస్)పై ప్రభావం చూపిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
దీంతో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వెల్లడించింది. ఈ క్రమంలో రకరకాల విశ్లేషణలు, రకరకాల ఊహాగాణాలు, పలు రకాల సందేహాలు, ఇంకెన్నో రకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సంస్థ మరో కీలక విషయాన్ని వెల్లడించింది! దీంతో.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైఖరి చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.
అవును... ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో గతలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా సుమారు 800 విమనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకు కారణం జీపీఎస్ వ్యవస్థపై సైబర్ దాడి జరగడమే అంటూ పలు విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఇది సైబర్ టెక్నాలజీతో కూడిన హైజాక్ అటెంప్ట్ అని.. ఇందులో పాకిస్థాన్ సౌజన్యంతో గాజాలోని హమాస్ ఉగ్రవాదుల హస్తం ఉందనే ప్రచారమూ జరుగుతుంది.
పైగా విమానాశ్రయం ప్రాంగణంలో మన ఇంటెలిజెన్స్ అధికారులకు 19 ల్యాప్ టాప్ లు, సుమారు 40 మొబైల్ ఫోన్లు దొరికాయని అంటున్నారు! వీటి సహకారంతో ఉగ్రవాదులు జీపీఎస్ సూఫింగ్ కి ప్రయత్నించి ఉంటారని చెబుతున్నారు! బీహార్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధానిలోని విమానాశ్రయాల నుంచి ప్రభుత్వ పెద్దలు పలువురు విమాశ్రయాలకు వస్తారని భావించి, ఈ పనికి పూనుకుని ఉంటారనే ప్రచారమూ తెరపైకి వచ్చింది.
తెరపైకి జూలైలోనే ఫ్లాగ్ చేయబడిన సమస్యలు!:
ఇన్ని ఊహాగాణాలు, ప్రచారాలు, విశ్లేషణలు, నివేదికల నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం జాతీయ మీడియా ద్వారా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం జరిగిన సిస్టం ఫెయిల్యూర్ సంఘటనను బహుశా నివారించేవారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంస్థ తెలిపింది. జూలైలోనే ఈ సమస్యల గురించి, అప్ గ్రేడ్ చేయవలసిన అవసరం గురించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి తెలియజేశారని ఏటీసీ గిల్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఇదే సమయంలో... అహ్మదాబాద్ లో ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ప్రమాదంలో 260 మంది మరణించిన తరువాత.. జూలై 8న ఎంపీలకు కూడా లేఖ రాశామని.. ఎయిర్ నావిగేషన్ సేవల్లో ఉపయోగించే ఆటోమేషన్ వ్యవస్థలను కాలానుగుణంగా సమీక్షించడం, అప్ గ్రేడ్ చేయడం చాలా అవసరం అని నొక్కి చెప్పామని గిల్డ్ తెలిపింది. ఈ వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అప్ గ్రేడ్ చేయాలని తెలిపినట్లు చెబుతున్నారు!
ఇందులో భాగంగా... భారతదేశ ఆటోమేషన్ వ్యవస్థ.. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, యూరప్ యూరో కంట్రోల్ లాగా ఉండాలని లేఖలో గిల్డ్ పేర్కొందని అంటున్నారు. ఈ దేశాలలో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణలు ఆధునిక సాంకేతికత.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముప్పు గుర్తింపుతో పాటు రియల్ టైమ్ డేటా షేరింగ్ కలిగి ఉన్నాయని వారు ఎత్తి చూపారని అంటున్నారు. ఈ తీవ్రమైన భద్రతా సమస్యలను ఏఏఐ దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లామని.. అయినా దీనిపై ఎటువంటి ఖచ్చితమైన చర్యలు తీసుకోలేదని గిల్డ్ తెలిపింది!