ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 10 భూకంపాలు ఇవే!
బుధవారం తెల్లవారుజామున రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.8గా నమోదైంది.;
బుధవారం తెల్లవారుజామున రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.8గా నమోదైంది. ఈ క్రమంలో రష్యాలోని కామ్చాట్ స్కీ ద్వీపకల్పంతో పాటు జపాన్ కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే రష్యా, జపాన్ లను సునామీ తాకింది. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే అని అంటున్నారు.
అవును... రష్యాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో... ఫలితంగా 4 మీటర్లు ఎత్తుకు సునామీ అలలు ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో జపాన్ లో తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలొస్తున్నాయి. దీంతో.. మరో ఉపద్రవం తప్పదా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపాలను ఇప్పుడు పరిశీలీద్దామ్..!
1. చిలీ (1960):
ప్రపంచంలోనే అత్యంత భారీ భూకంపంగా 1960లో చిలీని తాకిన భూకంపాన్ని చెబుతారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 9.5 గా నమోదైంది. దీనిని గ్రేట్ చిలీ లేదా వాల్డివియా భూకంపం అని కూడా పిలుస్తారు. ఈ భూకంపం కారణంగా సుమారు 1,655 మంది మరణించగా.. దాదాపు 2 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
2. అలాస్కా (1964):
చిలీ భూకంప తర్వాత 1964లో అమెరికాలోని అలాస్కాలో ఒక భారీ భూకంపం సంభవించింది. దీనిని గ్రేట్ అలాస్కా భూకంపం లేదా గుడ్ ఫ్రైడే భూకంపం అని పిలుస్తారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.2గా నమోదవ్వగా... దీని ధాటికి 130 మంది మరణించారు. ఇదే సమయంలో... సుమారు 2.3 బిలియన్ డాలర్ల నష్టం కలిగినట్లు చెబుతారు.
3. సుమత్రా, ఇండోనేషియా (2004):
ఇదే క్రమంలో 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవులలో భారీ భూకంపం సంభవించింది. దాని ఫలితంగా వచ్చిన సునామీ దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా అంతటా విధ్వంసం సృష్టించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.1 గా నమోదవ్వగా.. సుమారు 2.8 లక్షలకు పైగా ప్రజలు మరణించారు. ఇదే సమయంలో.. దాదాపు 11 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
4. టోహోకు, జపాన్ (2011):
2011లో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. దీన్ని గ్రేట్ టోహోకు భూకంపం అని పిలుస్తారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.1గా నమోదవ్వగా... దీనిద్వారా వచ్చిన సునామీ కారణంగా సుమారు 15,000 మందికి పైగా మరణించగా.. దాదాపు 1.3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
5. కమ్చట్కా, రష్యా (1952):
1952లో రష్యాలోని కమ్చట్కాలో ఒక భయంకరమైన భూకంపం సంభవించింది. దాని వల్ల ఏర్పడిన సునామీ హవాయి దీవులను తాకింది. ఫలితంగా... 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన నష్టం కలిగింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.0గా నమోదైంది. తాగా భూకంపం కూడా ఇక్కడే సంభవించింది!
6. చిలీ (2010):
1960 తర్వాత 2010లో మరోసారి చిలీలోని బయోబియో ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 8.8గా ఉండగ.. దీని ధాటికి సుమారు 523 మంది మృతి చెందారు.. దాదాపు 3.7 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
7. ఈక్వెడార్ (1906):
ఈక్వెడార్, కొలంబియా సరిహద్దు సమీపంలో 1906లో ఓ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతగా నమోదైన ఈ ప్రకృతి వైపరీత్యంలో సుమారు 1,500 మంది మరణించారు.
8. అలాస్కా, అమెరికా (1965):
1965లో అలాస్కాలోని రాట్ దీవుల సమీపంలో భారీ భూకంపం సభవించింది. రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం వల్ల సుమారు 35 అడుగుల ఎత్తు సముద్రపు అలలు ఎగసిపడ్డాయి. అయితే.. ఈ ప్రాంతంలో జనాభా తక్కువగా ఉండటం వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం పరిమితంగానే ఉంది!
9. అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం (1950):
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో 1950లో 8.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనిని 'అస్సాం - టిబెట్ భూకంపం' అని పిలుస్తారు. నాడు ఈ భూకంపం భారీ విధ్వంసమే సృష్టించింది.. ఈ సందర్భంగా సుమారు 780 మంది ప్రాణాలు కోల్పోయారు.
10. సుమత్రా, ఇండోనేషియా (2012):
ఉత్తర సుమత్రా తీరంలో జరిగిన ఈ భూకంపంలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ విపత్తు వల్ల పెద్దగా నష్టం జరగలేదు కానీ.. కొంతమంది గుండెపోటు కారణంగా మరణించారని చెబుతారు.