రామ్మోహన్ నాయుడు క్రేజ్ పోయిందా ?

ఇదిలా ఉండగా ఈ ఏడాది జూన్ లో గుజరాత్ లోని అహ్మదాబాద్ వద్ద ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి ఏకంగా 250 మంది దాకా మరణించడంతో రామ్మోహన్ కి తొలి సవాల్ ఎదురైంది.;

Update: 2025-12-13 21:30 GMT

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు యువ నేత. ఏపీ సీఎం చంద్రబాబుకు అలాగే ప్రధాని మోడీకి కూడా బాగా ఇష్టుడిగా పేరు పొందారు. తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్నవారు. ఇక ఏ విషయం మీద అయినా నిండు పార్లమెంట్ లో అనర్గళంగా మాట్లాడగల నేర్పు ఆయన సొంతం. అందుకే ఆయనకు గట్టిగా నాలుగు పదుల వయసు రాకుండానే కేంద్రంలోని కీలకమైన ఫోర్ట్ పోలియోలలో ఒకదానిని ఇచ్చారు. అలా ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులు అయ్యారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర నుంచి పెద్ద పదవి, కేబినెట్ ర్యాంక్ స్థానం చిన్న వయసులోనే రామ్మోహన్ కి దక్కడంతో దానిని ఆయన నిభాయించగలరా అన్న సందేహాలు అయితే అనేక మందిలో ఉండేవి. కానీ ఆయన మెల్లగా నెగ్గుతూ వస్తున్నారు.

అది తొలి సవాల్ :

ఇదిలా ఉండగా ఈ ఏడాది జూన్ లో గుజరాత్ లోని అహ్మదాబాద్ వద్ద ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి ఏకంగా 250 మంది దాకా మరణించడంతో రామ్మోహన్ కి తొలి సవాల్ ఎదురైంది. ఆ ప్రమాదం చాలా దారుణమని అంతా భావించారు. ఇందులో ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం కూడా ఉందని కూడా ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర మంత్రికి ప్రైవేట్ ఆపరేటింగ్ వ్యవస్థ మీద మరింతగా పట్టు పెరగాల్సి ఉందని కూడా ఈ ఘటనని చూసిన వారు అంతా విమర్శించారు. మొత్తానికి దీని మీద విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రిగా రామ్మోహన్ చెప్పుకొచ్చారు. అలా ఆ ఇష్యూ తగ్గిపోగానే ఇపుడు కొత్తగా ఇండిగో సంస్థ అతి పెద్ద సంక్షోభాన్ని క్రియేట్ చేసింది. దాంతో ఈసారి ఏకంగా జాతీయ మీడియాతో పాటు, విపక్షాలు సైతం రామ్మోహన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

ఆయనదే తప్పు అంటూ :

ఒక విధంగా రామ్మోహన్ నాయుడు ఈ ఘటనతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అదే సమయంలో పార్లమెంట్ కూడా రన్ అవుతూండడంతో ఆయన అటు సభకు జవాబు చెప్పుకుంటూ ఇటు మీడియాను ఎదుర్కొంటూ మరో వైపు చూస్తే ఇండిగో సంస్థ విషయంలో చేయాల్సిన చర్యలు చేపడుతూ చాలా ఒత్తిడినే ఎదుర్కొన్నారు. ఇక రామ్మోహన్ నాయుడు ఇమేజ్ పూర్తిగా పోయిందని ఆయన పదవికే ముప్పు రావచ్చు అని మీడియాలో వార్తలు ప్రచారం కూడా అవుతూ వస్తున్నాయి. ఇవన్నీ ఒక వైపు పుకార్లు షికారు చేస్తూండగానే రామ్మోహన్ నాయుడు తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఆయన పార్లమెంట్ లో ధీటైన సమాధానంతో విపక్షాల ఆరోపణలు విమర్శలకు చెక్ పెట్టారు. పౌర విమానయాన శాఖ మోనోపలీ అయిపోయింది అన్న విమర్శలకు అర్ధవంతమైన బదులు ఇచ్చారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకుని దేశీయ విమానయాన రంగంలో మార్పులు తీసుకుని వస్తున్నామని అందులో భాగమే ఇదంతా అని వివరించే ప్రయత్నం చేశారు. మోనోపలీ అన్న మాటే రాదని అదే సమయంలో ప్రయాణికులు తమ లక్ష్యంగా ఉంటారని వారి కోసమే సంస్కరణలు అయినా మరేవి అయినా తెస్తామని కూడా ఆయన నొక్కి చెప్పారు.

టీవీ డిబేట్స్ లోనూ :

అదే విధంగా రామ్మోహన్ జాతీయ స్థాయిలో టీవీ డిబేట్లలోనూ తన బలమైన వాయిస్ వినిపించారు. ఆయన కేంద్ర ప్రభుత్వం పౌర విమాన యాన రంగంలో తీసుకుంటున్న చర్యల గురించి కూడా గట్టిగానే చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే ఇంత సమర్థంగా తన వాదనలు వినిపించడం ద్వారా అటు ఎండీయే ప్రభుత్వానికి ఇటు విపక్షాలకు మరో వైపు మీడియాకు కూడా తానేంటో రామ్మోహన్ తెలియచేశారు అని అంటున్నారు. ఏణ్ణర్థం కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా రామ్మోహన్ కి రాని పేరు ఈ ఘటనతో వచ్చిందని మంచికో చెడ్డకో దేశవ్యాప్తంగా రామ్మోహన్ పేరు మారుమోగింది ఇదే సందర్భంలో అని అంతా అంటున్నారు.

ఇపుడు ఆయన ఏమిటో మొత్తం దేశానికి తెలిసిందని అంటున్నారు. ఒక విధంగా ఇండిగో సంస్థ సృష్టించిన పెను సంక్షోభం ఆయనకు మైనస్ గా మారినా దానిని సమర్ధంగా ఎదుర్కొని ప్లస్ గా మార్చుకునే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. అలా చూస్తే కనుక రామ్మోహన్ క్రేజ్ అయితే తగ్గలేదు సరికదా పెరిగిందని ఒక వైపు వాదన కూడా బలంగానే ఉంది. చూడాలి ముందు ముందు ఈ యువ నేత ఏ విధంగా రాటు తేలి రాణిస్తారో.

Tags:    

Similar News