మాజీ డీజీపీ మనమరాలుకు షాక్.. మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
సైబర్ బందిపోట్లు ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు. ఆ ట్రాప్ లో పడకుండా ఉండేలా మన చుట్టూ ఉన్న సిస్టంను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.;
అవును.. ఆమె సాక్ష్యాత్తు తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ మనమరాలు. అలాంటి స్థాయి ఉన్న వారికి సైబర్ నేరగాళ్లు షాకిస్తారని అస్సలు ఊహించం. డిజిటల్ ప్రపంచంలో వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా.. తమ ట్రాప్ లో పడే వారి హోదాను.. మరి దేన్ని చూసుకోకుండా చెలరేగిపోయే లక్షణం సైబర్ బందిపోట్లలో ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్లే ఇటీవల కాలంలోని పరిణామాలు ఉంటున్నాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం ఒకటి వెలుగు చూసింది. కాకుంటే.. నేరుగా మాజీ డీజీపీ మనమరాలు సైబర్ బందిపోట్ల చేతిలో మోసపోలేదు. ఆమె అకౌంటెంట్ ను నమ్మించారు. చివరకు నష్టపోయింది మాత్రం మాజీ డీజీపీ మనమరాలే.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మాజీ డీజీపీ మనమరాలి పేరుతో నమ్మించి వారి అకౌంట్ నుంచి రూ.1.2కోట్లు కొట్టేసిన ఘరానా మోసంగా దీన్ని చెప్పాలి. నిజానికి గతంలో దొంగలు అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి పేరు చెప్పేందుకు భయడపతారు. సంశయిస్తారు. కానీ.. అందుకు భిన్నంగా.. తాము ఎవరినైనా టార్గెట్ చేయగలం. ఆ మాటకు వస్తే.. హైప్రొఫైల్ వారిని లక్ష్యంగా చేసుకోవటం సులువన్నట్లుగా వారి తీరు ఉంటుంది. తాజా ఉదంతంలో తాము మోసపోయినట్లుగా గుర్తించిన మాజీ డీజీపీ మనమరాలు పోలీసుల్ని ఆశ్రయించటంతో విషయం అందరికి తెలిసేలా చేసింది. ఈ ఉదంతం నేర్పే పాఠం ఒక్కటే.
సైబర్ బందిపోట్లు ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు. ఆ ట్రాప్ లో పడకుండా ఉండేలా మన చుట్టూ ఉన్న సిస్టంను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాజీ డీజీపీ మనమరాలు మహిళా వ్యాపారవేత్త దివ్యారెడ్డి పద్దెనిమిది కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మార్చి 13న సైబర్ బందిపోట్లు ఆమె అకౌంటెంట్ కు వాట్సాప్ మెసేజ్ చేశారు. తాను మీటింగ్ లో ఉన్నానని.. తాను చెప్పిన బ్యాంకు అకౌంట్ కు రూ.1.2 కోట్లు వెంటనే ట్రాన్సఫర్ చేయాలని పేర్కొన్నారు. ఆ వాట్సాప్ అకౌంట్ పేరు, ఫోటోలు దివ్యారెడ్డివే ఉండటంతో నమ్మిన అకౌంటెంట్ డబ్బులు బదిలీ చేశాడు.
ఈ ఉదంతం జరిగిన నాలుగు రోజులకు అంటే మార్చి 17న మరోసారి ఆ అకౌంటెంట్ కు మళ్లీ డబ్బులు పంపాలని మెసేజ్ వచ్చింది. ఈసారి డబ్బులు బదిలీ చేయటానికి చెక్ అఫ్రూవల్ కోసం అతను డైరెక్టర్ ను సంప్రదించారు. ఈ మధ్యనే ఇదే తరహాలో డబ్బులు పంపామన్న విషయం వారి మధ్య చర్చకు వచ్చింది. వెంటనే దివ్యారెడ్డిని సంప్రదించారు. తమకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ తో రూ.1.20 కోట్లు పంపిన వైనాన్ని ఆమెకు చెప్పగా.. ఆమె షాక్ తిన్నారు.
తాను ఎవరికీ డబ్బులు పంపాలని చెప్పలేదని చెప్పటంతో అకౌంటెంట్ అవాక్కు అయి.. జరిగిన మొత్తం ఉదంతాన్ని వివరించాడు. దీంతో.. తాము మోసపోయినట్లుగా గుర్తించిన దివ్యారెడ్డి వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఈ సైబర్ నేరం మీద ఫిర్యాదు చేశారు. ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు.. సంపన్నులు తమ ఉద్యోగులు అందరికి సైబర్ మోసాల మీద అవగాహన కల్పించటంతో పాటు.. తగిన విధంగా సిద్ధం కావాల్సి ఉంది. లేదంటే.. భారీగా మోసపోయే వీలుంది.