నెలవారీ ఖర్చులకు క్రెడిట్ కార్డులే దిక్కు
నెలకు యాభై వేల రూపాయిల కంటే తక్కువ జీతం ఉన్న వారి ఖర్చుల తీరు తెన్నులు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు చేపట్టిన సర్వే.. పలు ఆసక్తికర అంశాల్ని గుర్తించింది.;
జేబులో పర్సు.. అందులో పైసలు లేకున్నా సరే.. క్రెడిట్ కార్డులతో ఖర్చు చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ విషయాన్ని దాదాపు 20 వేల మంది చిరుద్యోగులు.. స్వయం ఉపాధిలో ఉన్న వ్యక్తులపై జరిపిన సర్వేలో గుర్తించారు. క్రెడిట్ కార్డుల్నిఎంతలా వాడేస్తున్నారు? వారి ఆర్థిక ప్రవర్తనపై థింక్ 360 ఏఐ సర్వే వెల్లడించింది. దేశంలో క్రెడిట్ కార్డుల కల్చర్ ఎక్కువగా ఉన్నట్లుగా సర్వే రిపోర్టు వెల్లడించింది.
నెలకు యాభై వేల రూపాయిల కంటే తక్కువ జీతం ఉన్న వారి ఖర్చుల తీరు తెన్నులు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు చేపట్టిన సర్వే.. పలు ఆసక్తికర అంశాల్ని గుర్తించింది. నెల వారీ ఖర్చులకు సైతం సర్వేలో పాల్గొన్న వారిలో 93 శాతం వాడుతున్నట్లుగా పేర్కొన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా.. జేబులో ఉన్న క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
స్వయం ఉపాధిలో ఉన్న వారు సైతం తమ నెలావారీ ఖర్చులకు క్రెడిట్ కార్డుల మీదనే ఆధారపడుతున్న వారి సంఖ్య 85 శాతం ఉండటం గమనార్హం. ప్రస్తుతానికి ఖర్చు చేయటం.. తర్వాత చెల్లింపులు చేద్దాం (బౌ నౌ.. పే లేటర్) విధానానికి ఆకర్షితులయ్యే వారి సంఖ్యపైనా ఈ సర్వేలో క్లారిటీ వచ్చింది. ఈ తీరు చిరు ఉద్యోగుల్లో 15 శాతం మంది ఉంటే.. స్వయం ఉపాధి రంగంలో ఉన్న వ్యక్తులు 18 శాతంగా గుర్తించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మంజూరు చేసిన వ్యక్తిగత రుణాల్లో 72 శాతం వాటా ఫిన్ టెక్ కంపెనీలదే కావటం గమనార్హం.