సీపీఐ కార్యదర్శి పదవి నుంచి నారాయణ ఔట్.. కారణం ఇదే..
ఇలా తనదైన శైలిలో రాజకీయాలు చేసే నారాయణ తాజాగా క్రీయాశీల రాజకీయాల నుంచి తప్పుకొన్నారు.;
సీపీఐ జాతీయ కార్యదర్శి పదవి నుంచి నారాయణ తప్పుకున్నారు. ఆయనకు 75 ఏళ్ల వయసు నిండటంతో పార్టీ పదవి నుంచి ఆయన స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మనుగా నారాయణ కొనసాగనున్నారు. ఈ విషయాన్ని నారాయణే స్వయంగా ప్రకటించారు. పార్టీతో అంతర్గత సమస్యలు పరిష్కరించే బాధ్యతలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు నేతగా నారాయణ చిరపరిచితులు. విషయం ఏదైనా ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారని చెబుతారు. ఎలాంటి మొహమాటానికి తావులేకుండా ప్రభుత్వం, ప్రధాన రాజకీయ పార్టీలపై కుండబద్దలు కొట్టేలా నారాయణ మాట్లాడతారంటున్నారు.
విద్యుత్ చార్జీల పెంపు విషయంలో చంద్రబాబును ఏకేసిన నారాయణ తర్వాత అమరావతి విషయంలోను అభివృద్ధి విషయంలోనూ చంద్రబాబు ఆకాశానికి ఎత్తేశారు. ప్రధానిగా మోదీ పనితీరును మెచ్చుకునే నారాయణ మత రాజకీయాలకు తెరదీస్తున్నారని లౌకిక అనే పదానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని కూడా అనేక సందర్భాల్లో ఏకేశారు. ఇక, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులపై ఒక యుద్ధమే చేశారు. అయితే అదే సమయంలో వలంటీర్ వ్యవస్థను గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఆర్బీకే కేంద్రాలను మెచ్చుకున్నారు. ఇలా తనదైన శైలిలో రాజకీయాలు చేసే నారాయణ తాజాగా క్రీయాశీల రాజకీయాల నుంచి తప్పుకొన్నారు.
కమ్మసామాజిక వర్గానికి చెందిన నారాయణ యుక్త వయసు నుంచే పోరుబాట పట్టారు. సీపీఐలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన హయాంలోనే ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య అనేక సార్లు సఖ్యత కోసం ప్రయత్నాలు జరిగాయి. అంతేకాదు ఆయన హయాంలోనే కమ్యూనిస్టులు మెజార్టీ సంఖ్యలో చట్టసభల్లో పాల్గొన్నారు. అయితే, పార్టీ గతంలోనే తీసుకున్న నిర్ణయం మేరకు ఏ నాయకుడికైనా 75 ఏళ్లు నిండితే క్రియాశీలక పదవులకు రాజీనామాలు చేయాలి. ఈ క్రమంలోనే ఇటీవల 75 వసంతాలు పూర్తి చేసుకున్న నారాయణ తన పదవికి రాజీనామా చేశారు. ఇక, నుంచి ఆయన పార్టీకి సలహాదారుగా మాత్రమే కొనసాగుతారు.
సీపీఐ నారాయణగా పేరొందిన నారాయణ రెండు తెలుగు రాష్ట్రాల మీడియాకు అత్యంత స్నేహితుడు. ఆయన వచ్చారంటే పరుగు పరుగున మీడియా అక్కడ వాలిపోతుంది. ఆయన ఏం మాట్లాడినా వార్తే. ఆయన ఏం చేసిన వార్తే. ఒక సందర్భంలో ఆయన ప్రైవేటు పార్టీకి వచ్చారు. ఆ సమయంలో అక్కడ చికెన్ వంటకాన్ని ఆయనకు వడ్డించారు. దీనిని ఆయన తీసుకున్నారు. ఈ సమయంలో మీడియా మిత్రుడు ఒకరు‘సార్ ఈ రోజు అక్టోబరు 2 గాంధీ జయంతి. మద్యం, మటన్, చికెన్ పై నిషేధం ఉంది. మీరు ఎలా తీసుకున్నారు’’ అంటూ ప్రశ్నించారు. దీంతో అవాక్కయిన నారాయణ తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. ‘‘ఔను కదా, తప్పు చేశానయ్యా’’ అని అక్కడితో చేయి కడుక్కుని బయటకు వచ్చారు.
మిగిలిన మీడియా వారిని పిలిచి, ‘ఈ రోజు అక్టోబరు 2, గాంధీ గారి జయంతి. రమేష్ (మీడియా ప్రతినిధి) ఇప్పుడే చెప్పాడు. తప్పు ఎవరు చేసినా తప్పే. నాకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఈ రోజు నుంచి ఏడాది పాటు చికెన్ ముట్టను’. అని శపథం చేశారు. నిజంగా అలానే ఆయన ఏడాది పాటు చికెన్ జోలికి పోకుండా మాట నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ‘చికెన్ నారాయణ’ అనే పేరు కూడా వచ్చినా, ఎక్కడ బాధపడలేదు. నిబద్ధతకు ఆయన నిదర్శనంగా ఈ విషయాన్ని అంతా గుర్తు చేస్తారు.
ఇక సినీ నటులు నిర్వహించే టీవీ షోలపైనా విమర్శలు గుప్పించి నారాయణ ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షో, రోజా టీవీ షోలను నారాయణ తీవ్రంగా తప్పుబడుతుంటారు. అదే సమయంలో చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడిగా ఆరోపించి సెన్షేషన్ క్రియేట్ చేశారు. ఏదిఏమైనా తెలుగునాట అరుదైన రాజకీయ నాయకుల్లో నారాయణ ఒకరిగా చెబుతారు.