చంద్రబాబుపై మూడు పిటిషన్లు కొట్టివేత.. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కేకి షాక్
ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా మూడు పిటిషన్లు వేసిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి హైకోర్టు షాక్ ఇచ్చింది.;
ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా మూడు పిటిషన్లు వేసిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి హైకోర్టు షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆర్కే హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీటిని పరిశీలించిన హైకోర్టు విచారించాల్సిన అవసరం లేదని భావిస్తూ వాటిని కొట్టివేసింది. పిటిషనర్ సమర్పించిన అంశాల్లో ప్రాథమిక ఆధారాలు లోపించాయని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఆరోపణల ఆధారంగా కేసు విచారణను మార్చలేమని స్పష్టం చేసింది. ఈ తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఉపశమనంగా వ్యాఖ్యానిస్తున్నారు.
హైకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు చట్టపరంగా పెద్ద ఊరటనిచ్చిందని అంటున్నారు. వైసీపీ హయాంలో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసులో లోతైన విచారణ జరగాలని, దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని కోరుతూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి అనుబంధంగా ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ఉన్న కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని విన్నవించారు. అదేవిధంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఎం చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు, ఆర్కే విన్నపాలను తోసిపుచ్చింది. పిటిషనర్ సమర్పించిన అంశాల్లో ప్రాథమిక ఆధారాలు లోపించాయని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఆరోపణల ఆధారంగా కేసు విచారణను మార్చలేమని స్పష్టం చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆర్కే ఆరోపణలకు బలమైన చట్టపరమైన పునాది లేదని, వాదనలు బలంగా లేవని కోర్టు వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చట్టపరమైన విజయంగా వ్యాఖ్యానిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన పలు కేసుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఒకటి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు తర్వాత, ఈ కేసులో కూడా ఆయనను ఇబ్బంది పెట్టాలని చూసిన వైసీపీ శ్రేణులకు హైకోర్టు తీర్పు గట్టి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. ఈ తీర్పుతో సీఎం చంద్రబాబుపై ఉన్న అవినీతి ఆరోపణల్లో పస లేదని తేలిపోయిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.