దేశంలో ఇవ‌న్నీ పొదుపు రాష్ట్రాలే.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో ప్ర‌స్తుతం పొదుపు మంత్రం పాటిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రాష్ట్రాల వ‌ర‌కు.. అన్నిచోట్ల పొదుపు మాటే వినిపిస్తోంది.

Update: 2026-05-15 08:30 GMT

దేశంలో ప్ర‌స్తుతం పొదుపు మంత్రం పాటిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రాష్ట్రాల వ‌ర‌కు.. అన్నిచోట్ల పొదుపు మాటే వినిపిస్తోంది. ముఖ్య‌మంత్రులు, మంత్రుల కాన్వాయ్‌ల‌ను త‌గ్గించుకోవ‌డంతోపాటు.. మీటింగుల‌ను కూడా వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హించ‌డం.. వంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇక‌, కేంద్రం కూడా పొదుపు మంత్రం పాటిస్తోంది. ప్ర‌ధాని, కేంద్ర మంత్రుల ర‌వాణా వ్య‌యాన్ని తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే.. ఇవ‌న్నీ ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా.. త‌లెత్తిన చ‌మురు సంక్షోభంతో దేశీయ ఫారెక్స్‌(విదేశీ మార‌క‌ద్ర‌వ్యం) నిల్వ‌లు త‌రిగిపోతున్న ద‌రిమిలా తీసుకున్న నిర్ణ‌యాలే కావ‌డం గ‌మ‌నా ర్హం. అక్క‌డ ప‌రిస్థితి ఏ మాత్రం కుదుట‌ప‌డినా.. మ‌ళ్లీ రాష్ట్రాలు, కేంద్రం య‌థాత‌థంగా త‌మ ఖ‌ర్చులు కొన‌సాగించ‌నున్నాయి. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. అస‌లు సంక్షోభాల‌తో సంబంధం లేకుండా.. దేశంలో ని కొన్నిరాష్ట్రాలు కొన్ని ద‌శాబ్దాలుగా పొదుపు మంత్రం పాటిస్తున్నాయి.

వాటిలో అతి పెద్ద రాష్ట్రాలైన ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ బెంగాల్, కేర‌ళ వంటివి ముందు వ‌రుస‌లో ఉండ‌గా.. జార్ఖండ్ కూడా అదే జాబితాలో ఉంది. ఇక‌, ఈశాన్య రాష్ట్రాల్లోనూ.. పొదుపు పాటిస్తున్నవి మిక్కిలిగానే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో మంత్రుల‌కు, ముఖ్య‌మంత్రికి భారీ కాన్వాయ్‌లు ఉండ‌వు. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌.. తొలిసారి,... రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. త‌న కాన్వాయ్‌లో ఆరు వాహ‌నాల‌నే ప‌రిమితం చేశారు. ప్ర‌స్తుతం దీనిని మూడుకు త‌గ్గించారు.

ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులు ఏర్ప‌రిచిన సంప్ర‌దాయాన్ని 15 ఏళ్లుగా మ‌మ‌తా బెన‌ర్జీ కూడా పాటించారు. త‌ద్వారా కాన్వాయ్ సంఖ్య‌లో కేవ‌లం 4 వాహ‌నాలు మాత్ర‌మే ఉంటాయి. ఇక‌, ఆయా రాష్ట్రాల లో ముఖ్య‌మంత్రి, మంత్రుల వేత‌నాలు కూడా.. ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే.. చాలా వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఉంది. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ ఉచిత‌ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నా.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో మాదిరిగా.. ఉండ‌వు.

అక్క‌డ చాలా త‌క్కువ మొత్తంలో సామాజిక భ‌ద్రతా పింఛ‌న్లు ఇస్తారు.(1000-1500 రూపాయ‌ల లోపు) అలానే.. ఉచిత ప‌థ‌కాల‌ను ఖ‌చ్చితంగా రేష‌న్ కార్డుతో లింకు పెడుతున్నారు. త‌ద్వారా ప్ర‌భుత్వ వ్య‌యాన్ని అదుపు చేస్తున్నారు. అంతేకాదు.. అప్పుల జోలికి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌డంతో ప‌శ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలు ముందు జాబితాలో ఉన్నాయి. ఒక‌వేళ అప్పులు చేయాల్సి వ‌చ్చినా.. ఆ సొమ్మును ఉత్పాద‌క రంగాల‌కు మాత్ర‌మే వెచ్చిస్తున్నారు. ఇలా.. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఆయా రాష్ట్రాల్లో పొదుపు మంత్రం ప‌ఠిస్తున్నారు.

Tags:    

Similar News