ఫైనల్ బిల్లు రాకుంటే గ్రామ సచివాలయ భవనానికి తాళాలా?

గ్రామ సచివాలయభవనాన్ని నిర్మించి.. ఇటీవల ప్రారంభించిన ఈ భవనానికి తాళం వేసిన కాంట్రాక్టర్ తీరు విమర్శలకు తావిస్తోంది.

Update: 2024-01-18 09:30 GMT

ఏపీలో ఒక కాంట్రాక్టర్ ఘనకార్యం బయటకు వచ్చింది. గ్రామ సచివాలయభవనాన్ని నిర్మించి.. ఇటీవల ప్రారంభించిన ఈ భవనానికి తాళం వేసిన కాంట్రాక్టర్ తీరు విమర్శలకు తావిస్తోంది. ఫైనల్ బిల్లు ఇంకా రాలేదని.. బిల్లు వచ్చే వరకు తన అధీనంలోనే ఉంచుకుంటానంటున్న వైనం షాకింగ్ గా మారింది. ఇలాంటి వారిపై జగన్ సర్కారు తీసుకునే చర్యలు ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెంలో రూ.40 లక్షల నిధులతో గ్రామ సచివాలయాన్ని నిర్మించారు. రెండు నెలల క్రితం దీన్ని ఘనంగా ప్రారంభించారు. ఇక్కడివరకు అంతా బాగున్నా.. ఆ తర్వాతే తేడా కొట్టింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కోనా రఘుపతి.. ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ భవనాన్ని వేడుకలా నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభించారు.

2023 నవంబరు 15న ఈ భవనం ఓపెనింగ్ జరగ్గా.. ఇది జరిగి రెండు నెలలు అవుతున్నా.. గ్రామ సచివాలయానికి తాళాలు వేసి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత గ్రామ సచివాలయాన్ని కొత్త భవనంలోకి మార్చకపోవటం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఇప్పటికి అద్దె భవనంలోనే గ్రామ సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు.

ఇంతకూ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ఆరా తీస్తే.. కొత్త భవనానికి జరగాల్సిన చెల్లింపులు పూర్తి స్థాయిలో కాకపోవటమేనని తేలింది. ఫైనల్ బిల్లు కాంట్రాక్టర్ చేతికి రాలేదని.. పేమెంట్ సెటిల్ అయ్యాక మాత్రమే భవన తాళాలు చేతికి ఇస్తామన్న వైఖరి షాకింగ్ గా మారింది. సాధారణంగా బిల్లులు పెండింగ్ ఉండటం.. ప్రాధాన్యత క్రమంలో భాగంగా నిధులు విడుదల చేయటం మామూలే. అందుకు భిన్నంగా బిల్లు పెండింగ్ ఉందన్న కారణంగా.. ప్రారంభోత్సవం పూర్తైన బిల్డింగ్ కు తాళం వేసిన కాంట్రాక్టర్.. దాన్ని తన దగ్గరే ఉంచుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News