బిగ్ డౌట్: రాజ్యాంగం సరిగానే అమలవుతోందా?
గతమైనా ప్రస్తుతమైనా.. రాజ్యాంగానికి ఆటుపోట్లు తప్పడం లేదు. ఇటీవలి వరకు.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది.;
నేడు(నవంబరు 19) భారత రాజ్యాంగ దినోత్సవం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రజలు, ప్రభుత్వాలకు హక్కులతోపాటు బాధ్యతలను దఖలు పరుస్తూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగ పరిషత్తు రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఇదే. 1949, నవంబరు 26న ఆమోదించుకున్న భారత రాజ్యాంగం.. దేశంలోని అన్ని వర్గాలకు సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, అదేసమయంలో సమ న్యాయాన్ని అందిస్తోంది. ప్రాథమిక హక్కులతోపాటు ప్రాథమిక విధులను కూడా నిర్దేశించి.. దేశంలో పౌరులు ఏవిధంగా మెలగా లన్న దానికి దిశానిర్దేశం చేస్తోంది.
ఇప్పటికి పలుమార్లు సవరణలు జరిగినప్పటికీ.. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్నట్టు భారత ప్రజలమైన మేము , భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి.. దేశం యావత్తు ఐక్యంగా ముందుకు కదులుతోంది. కాగా, భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, 448 ఆర్టికల్స్ ఉన్నాయి. వాస్తవానికి 1949, నవంబరు 26న రాజ్యాంగం ఆమోదించినప్పుడు 22 భాగాలు, 8 షెడ్యూళ్లు, 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇదిలావుంటే.. గత కొన్నాళ్లుగా రాజ్యాంగం చుట్టూ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ దేశంలో రాజ్యాంగం పట్ల అందరికీ గౌరవం ఉంది. కానీ.. ఇది అందరికీ సమానంగా అమలవుతోందా? అనేది ప్రశ్న. న్యాయం, చట్టం ఈ రెండు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటే.. ఉన్నవారికి ఒక న్యాయం. .. లేని వారికి మరో న్యాయం అన్నది అందరికీ తెలిసిందే. కానీ, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంద ర్భంగా రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తామన్న ప్రధాని మోడీ కానీ.. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు కానీ.. ఆ తర్వాత ఈ విషయాలను మరిచిపోయారు.
గతమైనా ప్రస్తుతమైనా.. రాజ్యాంగానికి ఆటుపోట్లు తప్పడం లేదు. ఇటీవలి వరకు.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. `లౌకిక` అనే పదాన్ని తొలగించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్ వాదన బలంగా వినిపించింది. కానీ, ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం ఏమీ జరగక పోయినా.. తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం.. కొంత భయాన్ని అయితే.. కల్పిస్తున్నాయి. ఇది ఎటు దారి తీస్తుందన్నది చర్చ.
తాజాగా ఇదే వివాదం..?
రాజ్యాంగ దినోత్సవానికి ముందు రోజు(అంటే.. మంగళవారం) అయోధ్యలో రామమందిర శిఖరంపై ధర్మ ధ్వజాన్ని పీఎం మోడీ ఆవిష్కరించారు. అయితే.. ఈకార్యక్రమానికి.. ఫరీదాబాద్ ఎంపీ.. హాజరు కాలేదు. ఇది వివాదంగా మారింది. తాను ముస్లిం అయినందుకే.. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించలేదని.. `లౌకిక` అన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. దీనిని బీజేపీ మరో కోణంలో ఎదురు దాడి చేసింది. ''మీరు రావాలని అనుకుంటే.. పిలకపోయినా.. రావొచ్చు'' అని తెలిపింది. వాస్తవానికి ప్రొటోకాల్ ప్రకారం పిలవాల్సిన ఎంపీని విస్మరించడం.. తాజాగా చర్చకు వచ్చింది.