జగన్ పట్ల కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్ ?

ఇలా ఒక్కో సంఘటనలు ముడి పెట్టి చూసేవారికి మాత్రం ఏదో జరగబోతోందా అన్న సందేహం అయితే వస్తోంది అని అంటున్నారు. రాజకీయాల్లో ఏదీ జరగదు అని ఎవరూ అనుకోలేరు.

Update: 2026-06-14 04:43 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల కాంగ్రెస్ పెద్దలు సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. దానికి ఇటీవల కాలంలో అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయని అంటున్నారు. దేశంలో బీజేపీ భారీ ఎత్తున పుంజుకోవడంతో కాంగ్రెస్ కి దక్షిణాది మాత్రమే పెద్ద దిక్కుగా మారింది. అందులో మూడు రాష్ట్రాలలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. తమిళనాడులో విజయ్ పార్టీతో పొత్తు కూడా లాభదాయకంగా ఉంది. ఏపీ ఒక్కటే ఇపుడు కాంగ్రెస్ కి నిలువ నీడ లేకుండా చేస్తోంది. అక్కడ కాంగ్రెస్ కి ఉనికి లేదు, పొత్తుకు దిక్కు లేదు అన్నట్లుగా సీన్ ఉంది. ఈ కీలక పరిణామాలు హస్తం పార్టీ పెద్దలను జగన్ వైపుగా చూసేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయని అంటున్నారు.

డీకే సీఎం కావడంతో :

ఇక దక్షిణాదిన ఇటీవల జరిగిన అతి ముఖ్య పరిణామం డీకే శివకుమార్ కర్ణాటక కొత్త సీఎం కావడం. ఆయన వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు అని చెబుతారు. అంతే కాదు జగన్ తో కూడా ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయని కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం జగన్ కర్ణాటకలోని బెంగళూరు లో ఉంటున్నారు. వైసీపీ ఏపీలో ఓటమి పాలు అయిన దగ్గర నుంచి జగన్ అక్కడే ఉంటున్నారు. మరి అది పొలిటికల్ గా సేఫెస్ట్ ప్లేస్ గా జగన్ భావించారు అంటేనే అర్థం చేసుకోవాలని కూడా అంటారు. అదే విధంగా జగన్ ఏపీలో బలమైన నాయకుడిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పెద్దలు దక్షిణ భారతం అంతా కాంగ్రెస్ మయం చేయాలని డీకే మీదనే కీలక బాధ్యతలు అప్పగించారు అని చెబుతున్నారు.

ఆమెకు దక్కని పదవి :

మరో వైపు చూస్తే ఏపీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల జగన్ మీద నిన్నా మొన్నటి వరకూ తీవ్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడే వారు. ఇపుడు ఆమె కొంత సౌండ్ తగ్గించారు అని అంటున్నారు. పైగా కూటమి మీద ఫోకస్ చేసి ఘాటుగానే విమర్శలు చేయడం ఆలోచించాల్సిన విషయం అని అంటున్నారు. అవన్నీ పక్కన పెడితే నోటి దాకా వచ్చిన షర్మిల పదవి ఆగిపోవడానికి కూడా కారణాలు ఉన్నాయని అంటున్నారు. షర్మిలకు జాతీయ స్థాయిలోనే రాజ్యసభ సీటు ఖరారు అయింది. కర్ణాటక కోటాలో కాంగ్రెస్ నుంచి ఆమె పెద్దల సభకు వెళ్లాల్సి ఉంది. కానీ అనూహ్యంగా దానికి బ్రేక్ పడింది. దీని వెనక కూడా అనేక అర్ధాలు పరమార్ధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏపీలో జగన్ ని మచ్చిక చేసుకునే ఎత్తుగడలో భాగంగానే ఈ విషయంలో ఏమైనా చేసారా అన్న చర్చ కూడా వస్తోంది అంటున్నారు.

రేవంత్ నోటి వెంట :

ఇక రేవంత్ రెడ్డి ఎపుడూ జగన్ గురించి సానుకూలంగా మాట్లాడింది లేదు. జగన్ కూడా రేవంత్ రెడ్డి విషయంలో ఏనాడూ స్పందించింది లేదు. అలాంటిది జగన్ సభలకు కూటమి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం సంచలంగానే అంతా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి యధాలాపంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండరని కూడా అంటున్నారు. ఆయన జగన్ కి ఫేవర్ గా మాట్లాడారు అంటే ఏమిటి విషయం అని వాకబు చేస్తున్న వారూ ఉన్నారు. ఇక దక్షిణాదిన డీకే శివకుమార్ తరువాత కాంగ్రెస్ అధినాయకత్వం ఎక్కువగా నమ్మేది రేవంత్ రెడ్డినే అని అంటున్నారు. మరి ఆయన కూడా తన సాటి రాష్ట్రం ఏపీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరుకుంటున్నారు అని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కామెంట్స్ ని వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నారు.

రఘువీరా వ్యాఖ్యలు :

రాయలసీమ అనంతపురానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏఐసీసీ మెంబర్ అయిన రఘువీరా రెడ్డి జగన్ మీద తాజాగా సానుకూలమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం కావాలని కాంగ్రెస్ లో ఉన్నపుడు సంతకాల సేకరణ చేయించలేదని అన్నారు. తమ పార్టీ నేతలు కొందరు జగన్ కోసం అలా చేశారు. అంతే కాదు జగన్ కాంగ్రెస్ లో ఉంటే ఉమ్మడి ఏపీకి సీఎం అయి ఉండేవారు అన్నారు. జగన్ కి షర్మిలకు మధ్య మీడియావే చిచ్చు పెడుతోందని కూడా అన్నారు. జగన్ గురించి ఇలా పాజిటివ్ గా ఈ మాజీ మంత్రి స్పందించడం వెనక కూడా చర్చ సాగుతోంది.

ఏపీ మీద ఫోకస్ :

ఇలా ఒక్కో సంఘటనలు ముడి పెట్టి చూసేవారికి మాత్రం ఏదో జరగబోతోందా అన్న సందేహం అయితే వస్తోంది అని అంటున్నారు. రాజకీయాల్లో ఏదీ జరగదు అని ఎవరూ అనుకోలేరు. అక్కడ అనివార్యత కీలక పాత్ర పోషిస్తుంది. మరి 2029 ఎన్నికల్లో కేంద్రంలో గెలిచి అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ కి దక్షిణాదిన మూడు పెద్ద రాష్ట్రాలలో ఒకటి అయిన ఏపీ మీద ఫోకస్ ఎందుకు ఉండదని అంటున్నారు. ఏపీ మీద కాంగ్రెస్ చూపు ఉంటే కచ్చితంగా జగన్ గురించి కూడా ఆలోచిస్తున్నారా అన్నదే ఇపుడు అసలైన చర్చగా ఉంది మరి. చూడాలి ఈ ప్రచారాలలో ఊహాగానాలలో ఎంత మేరకు నిజం ఉంది అన్నది.

Tags:    

Similar News