రాహుల్, విజయ్ వీడియోపై దేశంలో రచ్చ.. అసలు ఎక్కడికి వెళ్లింది.. మళ్లీ ఎలా తిరిగి వచ్చింది.. నిలదీస్తున్న కాంగ్రెస్..

తమిళనాడులో నూతనంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన విజయ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోపై చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.;

Update: 2026-05-11 05:38 GMT

సాంకేతికత విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఈ రోజుల్లో, రాజకీయ పోరాటాలు వీధుల నుంచి సోషల్ మీడియా వేదికలకు మళ్లాయి. ఒక చిన్న పోస్ట్, ఒక సెల్ఫీ లేదంటే ఒక వీడియో నిమిషాల్లో దేశవ్యాప్త చర్చకు దారితీస్తున్నాయి. అయితే, ఇదే సాంకేతికత ఒక్కోసారి రాజకీయ శక్తుల మధ్య అగాధాన్ని కూడా సృష్టిస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో గళం విప్పే స్వేచ్ఛపై సోషల్ మీడియా దిగ్గజాల నియంత్రణ ఎంతవరకు ఉందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ముఖ్యంగా ఇద్దరు బలమైన నాయకులు కలిసిన సందర్భానికి సంబంధించిన దృశ్యాలు మాయమవ్వడం, అది కేవలం సాంకేతిక లోపమా లేక ఉద్దేశపూర్వక చర్య అన్న కోణంలో సరికొత్త వివాదం చెలరేగింది. అగ్రనేతల డిజిటల్ కదలికల చుట్టూ ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంది.

విజయ్, రాహుల్ రీల్‌పై ఇన్‌స్టా వేటు..?

తమిళనాడులో నూతనంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన విజయ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోపై చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. వీరిద్దరూ కలిసి ఉన్న సమయంలో విజయ్ స్వయంగా తీసిన సెల్ఫీ వీడియోను రాహుల్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియో అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేదంటే కారణం లేకుండా మెటా ఈ రీల్‌, దీనికి సంబంధించిన ఫోటోలను బ్లాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.

విపక్షాల గొంతు నొక్కుతున్నారు..

ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత శ్రీవత్స సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘రాహుల్ గాంధీ, విజయ్ వంటి ప్రజాదరణ ఉన్న నాయకుల ఫోటోలను, వీడియోలను మెటా ఎందుకు అడ్డుకుంటోంది?’ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కడానికి, వారి సోషల్ మీడియా అకౌంట్లను అణచివేయడానికి కేంద్రం మెటాపై ఒత్తిడి తెస్తుందని ఆయన ఆరోపించారు. ఒక రాష్ట్ర సీఎం, దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నేత కలిసిన దృశ్యాలను ప్రజలకు చేరకుండా చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. డిజిటల్ వేదికలపై కూడా వివక్ష చూపుతున్నారని ట్వీట్ చేశారు.

సాంకేతిక లోపమా.. రాజకీయ కుట్రనా?

ఈ వివాదం ముదురుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వ వర్గాలు, ఇన్‌స్టా ప్రతినిధుల నుంచి వివరణ వచ్చినట్లు సమాచారం. యాప్‌లో ఏర్పడిన చిన్నపాటి సాంకేతిక సమస్య (Glitch) కారణంగానే రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిందని, వెంటనే గుర్తించి రీస్టోర్ చేశారని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ, కీలకమైన రాజకీయ సందర్భాల్లోనే ఇలాంటి లోపాలు ఎందుకు తలెత్తుతాయన్నది విపక్షాల ప్రధాన సందేహంగా ఉంది.

సోషల్ మీడియా అల్గారిథమ్‌ నియంత్రణపై చర్చ

ఈ ఘటనతో సోషల్ మీడియా కంపెనీల పనితీరుపై మళ్లీ చర్చ మొదలైంది. ఏ కంటెంట్‌ను ఉంచాలి, దేన్ని తొలగించాలి అనే విషయంలో సంస్థలు అనుసరిస్తున్న అల్గారిథమ్‌లు పారదర్శకంగా లేవనే విమర్శలుస్తున్నాయి. రాజకీయంగా ప్రభావితం చేసే అంశాల విషయంలో కంపెనీలపై ప్రభుత్వాల ఒత్తిడి ఉంటుందనే ఆరోపణలు వస్తుంటాయి. విజయ్, రాహుల్ గాంధీ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధం ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని చూశారా? అన్న చర్చ తమిళనాడు, జాతీయ రాజకీయాల్లో సాగుతోంది.

కాంగ్రెస్ కు ఒక అస్త్రం..

వీడియో గ్లిచ్ వల్ల తొలగింపునకు గురైనా.. కాంగ్రెస్ మాత్రం పట్టు వీడడం లేదు. గ్లిచ్ కాదు.. శక్తి వంతమైన ఇద్దరు నాయకుల కలయిక దేశానికి తెలియవద్దనే ఈ పన్నాగం పన్నారని ఆరోపిస్తుంది. సాక్షాత్తు మెటా వివరణ ఇచ్చినా కూడా హస్తం నాయకులు పట్టించుకోవడం లేదు.. తమ సోషల్ మీడియాను అడ్డుకొని తమను ప్రజల నుంచి దూరం చేస్తున్నారని విమర్శలకు దిగుతున్నారు. తిరిగి వీడియో తెచ్చినా కూడా వారు ఈ అంశాన్ని మాత్రం విడిచిపెట్టేలా కనిపించడం లేదు..

ప్రస్తుతానికి సదరు రీల్ ఇన్‌స్టాలో తిరిగి అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఈ ఉదంతం సృష్టించిన రాజకీయ దుమారం అంత సులభంగా సర్దుమణిగేలా లేదు. రాబోయే రోజుల్లో సోషల్ మీడియా వేదికలపై రాజకీయ నాయకుల పోస్ట్‌ల విషయంలో మరిన్ని కఠిన నిబంధనలు లేదా వివాదాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టెక్నాలజీ అనేది సమాచారానికి వారధిగా ఉండాలి తప్ప, అడ్డంకిగా మారకూడదని అందరూ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News