కోమటిరెడ్డి వ్యవహారాన్ని చూస్తూ ఊరుకోం: కాంగ్రెస్
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. చేసిన వ్యాఖ్యలను.. పార్టీ చూస్తూ ఊరుకోదని, దీనిపై చర్యలు తీసుకుంటుందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు.;
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. చేసిన వ్యాఖ్యలను.. పార్టీ చూస్తూ ఊరుకోదని, దీనిపై చర్యలు తీసుకుంటుందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఒక్కరిని ఇలా వదిలేస్తే..రేపు మరింత మంది వ్యాఖ్యలు చేస్తే.. అప్పుడు పార్టీ బద్నాం అవుతుందన్నారు. ''దేనికైనా కొన్ని హద్దులు ఉంటాయి. ఎవరికైనా కొన్ని అవకాశాలు వుంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అవసరం, అవకాశం ఉంటే.. తప్పకుండా పదవులు వస్తాయి. అవి రాలేదని యాగీ చేయడం సరికాదు. కోమటిరెడ్డి వ్యవహారాన్ని చూస్తూ ఊరుకునేది లేదు.'' అని గౌడ్ అన్నారు.
అంతేకాదు.. కోమటిరెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని పార్టీ పీసీసీ చీఫ్‌గా తాను క్రమ శిక్షణ సంఘాన్ని కోరినట్టు మహేష్ గౌడ్ తెలిపారు. దీనిపై వర్కవుట్ జరుగుతుందన్నారు. తొందర పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎవరైనా సరే.. పార్టీని ధిక్కరించడానికి వీల్లేదన్న మహేష్ గౌడ్.. పార్టీ నిర్ణయానికి అతీతులు ఎవరూ ఉండబోరని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ అవకాశం కోసం చూడడం తప్పులేదన్న ఆయన.. అలాగని నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. కాగా.. రాజగోపాల్ రెడ్డి గత నాలుగు రోజులుగా తనకు మంత్రి పదవి ఇస్తామని ఇవ్వలేదంటూ.. రాజకీయంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పార్టీలోనూ.. బయట కూడా చర్చ జరుగుతోంది.
ఇదిలావుంటే.. బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉందని మహేష్ గౌడ్ చెప్పారు. తాను కూడా వ్యక్తిగతంగా దీనిపై ఆలోచన చేస్తున్నానన్నారు. అయితే.. రాష్ట్రపతి నిర్ణయం కోసం వేచి చూస్తున్నామన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందన్నారు. ఇక, రాష్ట్రంలో తలెత్తిన 'మార్వాడీ గోబ్యాక్' అంశంపై మాట్లాడుతూ.. వారంతా తెలంగాణ ప్రజల్లో భాగమని.. వారిని వెళ్ల గొట్టే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నా.. ఇక్కడివారికి అవకాశం కల్పిస్తున్నారన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని, పన్నులు కూడా కడుతున్నారని అన్నారు. ఈ విషయంలో పార్టీ పరంగా వారికి అండగా ఉంటామని చెప్పారు.