సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులపై ఉండవల్లి వ్యాఖ్యలు.. భారీ ఎత్తున ట్రోలింగ్‌!

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ నడిచింది.

Update: 2023-10-25 14:30 GMT

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు.. ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. అయితే తరచూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వివిధ యూట్యూబ్‌ చానెళ్లకు, మీడియా చానెళ్లకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో ప్రత్యేక హోదాపై, పోలవరం ప్రాజెక్టుపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు గతంలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఇటీవల స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టును కోరారు.

కాగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చేసిన కొన్ని తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీస్తున్నాయి. ‘‘సాఫ్ట్‌వేర్‌ అంటే ఏమిటి? ఇది టైపింగ్‌ తప్ప మరొకటి కాదు. చాలా మంది యువత ఈ టైపిస్ట్‌ పోస్టులను ఎంచుకున్నారు. ముఖ్యంగా, దక్షిణాది నుండి చాలా మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఈ టైపిస్ట్‌ ఉద్యోగాలను కైవసం చేసుకున్నారు, ఎందుకంటే ఉత్తరాది వారికి పెద్దగా ఆంగ్ల భాషా నైపుణ్యాలు లేవు ’’ అని ఉండవల్లి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

Read more!

దీంతో సహజంగానే ఉండవల్లి వ్యాఖ్యలపై ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ‘‘ఉండవల్లి మేధావి అనుకున్నాం. సాఫ్ట్‌వేర్‌... టైపింగ్‌ తప్ప మరొకటి కాదని ఆయన ఎలా చెప్పగలరు? ఆయన అలా ఎలా మాట్లాడగలరు? ’’ అని నిలదీస్తున్నారు.

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ నడిచింది.

కొంతమంది ఐటి ఉద్యోగులు ఉండవల్లి వ్యాఖ్యలతో బాధపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీ విలువ, ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో భారతదేశం ఎలా ఆధిపత్యం చెలాయిస్తోంది అనే వాటి గురించి వారు సుదీర్ఘ వివరణలు ఇచ్చారు.



Tags:    

Similar News