దంచి కొడుతున్న టీడీపీ `కాపీ క‌బుర్లు` ..!

`కాఫీ కబుర్లు` పేరుతో టిడిపి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోంది.;

Update: 2026-04-05 01:30 GMT

`కాఫీ కబుర్లు` పేరుతో టిడిపి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోంది. టిడిపి కేంద్ర కార్యాలయంలో గత కొన్ని రోజులుగా పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలకు, అదే విధంగా క్లస్టర్ ఇన్చార్జిలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి.. ప్రత్యర్థుల పై ఏ విధంగా పై చేయి సాధించాలి... అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లే విష‌యంపై త‌ర్ఫీదు ఇస్తున్నారు.

దీంతో పాటు చంద్ర‌బాబు స‌హా మంత్రి లోకేష్ తీసుకువస్తున్న పెట్టుబడులు, కల్పిస్తున్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే అంశాలపై ఏ విధంగా ప్రచారం చేయాలని అంశాలను వారికి వివరిస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీని గెలుపు గుర్రం ఎక్కించడమే లక్ష్యంగా ఈ శిక్షణ జరుగుతోంది. దీనిలో భాగంగా `కాఫీ కబుర్లు` అనే పేరుతో వినూత్న‌ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నారు.

దీనిని ప్రధానంగా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో నారా లోకేష్ రెండుసార్లు పార్టీ కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబు సైతం రెండుసార్లు పార్టీ ఆఫీస్ కి వచ్చారు. ఈ సందర్భంగా `కాఫీ కబుర్లు` పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్‌ తీసుకున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు, పార్టీలో నాయకులకు -కార్యకర్తలకు మధ్య ఉన్న రిలేషన్ అడిగి తెలుసుకుంటున్నారు.

అంతేకాదు ఏవిధంగా ముందుకు సాగాలి.. ఉన్నత స్థాయి ప్రజల నుంచి క్షేత్రస్థాయిలో సాధారణ ప్రజల వరకు పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలనే అంశంపై వారు చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్రమైన విషయం ఏమిటంటే అందరితోపాటు కూర్చుని కాఫీ తాగుతూ వారితో ముచ్చటించడం. ఎవరు ఏం చెప్పినా వినే అవకాశం ఇవ్వడం... ప్రధానంగా కార్యకర్తలను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో వ్యక్తిగత అంశాలకు కూడా ప్రాధాన్య ఇస్తున్నారు. కొంతమంది కార్యకర్తలు తమ కుటుంబాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తుంటే ఓపికగా వింటున్నారు.

ఇక పార్టీ పరంగా అయితే వారు చెప్పింది వింటూనే మరికొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. మొత్తంగా `కాఫీ కబుర్లు` కార్యక్రమం టిడిపిలో ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి నెలకొంది. ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం టిడిపికి ఇదే తొలిసారి. గతంలో బిజెపి `చాయ్ పే చర్చా` వంటి కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అదే తరహాలో టిడిపి కాఫీ కబుర్లు పేరుతో కార్యక్రమాన్ని ఎంచుకుని నిర్వహించడం ద్వారా కార్యకర్తలకు మరింత చేరువ అయ్యేలా వ్యవహరిస్తోంది.

Tags:    

Similar News