కాక్రోచ్ జనతా పార్టీ.. 48 గంటల్లోనే రికార్డు సభ్యత్వం.. జాతీయ రాజకీయాల్లో కొత్త సంచలనం!

అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే చేపట్టే పనులు ఇవేనంటూ ఐదు అంశాలతో కూడిన మేనిఫెస్టోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

Update: 2026-05-20 06:24 GMT

కాక్రోచ్ జనతా పార్టీ.. కాక్రోచ్ అంటే బొద్దింక.. ఏంటి పార్టీ పేరును బొద్దింక అని పెట్టుకున్నారని ఆశ్చర్యపోతున్నారా? నిజమే ఆ పార్టీ ఆవిర్భవించిన తీరు, విధి విధానాలు ఇంకా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆన్ లైన్ వేదికగా పుట్టికొచ్చిన ఈ పార్టీ సారథి 30 ఏళ్ల అభిజీత్ దీప్కే అనే యువకుడు. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ (సోమరితనం) తన పార్టీ నినాదాలని అభిజిత్ దీప్కే వెల్లడించాడు. ఇదంతా చదువుతుంటే అంతా గందరగోళం ఉందని, వింతగా ఉందని అనుకుంటున్నారు కదా, అవును ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వ్యవస్థల పనితీరుపై ఓ యువకుడు సంధించిన వ్యంగ్యాస్త్రమే కాక్రోచ్ జనతా పార్టీ.

సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా సీజేపీ!

నిరుద్యోగులు సోమరిపోతుల్లా మారి బొద్దింకల్లా తయారయ్యారని, జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు చట్టం కార్యకర్తల పేరుతో వ్యవస్థపై దాడి చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ, ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతూనే ఉందని అంటున్నారు. ఇందులో భాగంగానే అభిజిత్ దీప్కే వ్యంగ్యంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. తన పార్టీ యువత కోసం పనిచేస్తుందని, ప్రజల సొమ్ము ఎటుపోతుందో నిలదీయటానికి పార్టీని స్థాపించినట్లు వివరించాడు. ఇక తన పార్టీలో చేరడానికి కొన్ని అర్హతలు, నిరుద్యోగం, సోమరితనం (భౌతికంగానే మానసికంగా కాదు) ఆన్ లైన్ కు (ఫోన్, సోషల్ మీడియా)కు అతుక్కుని ఉండటం. వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా వెల్లగక్కే నైపుణ్యం ఉండాలని షరతులు పెట్టాడు.

అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే చేపట్టే పనులు ఇవేనంటూ ఐదు అంశాలతో కూడిన మేనిఫెస్టోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అవి కూడా వ్యంగ్యంగానే ఉండటంతో విస్తృత చర్చ జరుగుతోంది. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఎప్పటికీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వమని మొదటి అంశం పేర్కొనగా, నిజమైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోయినా దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ను ఉపా చట్టం కింద అరెస్టు చేస్తామని రెండో హామీనిచ్చారు. ఇక పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని మూడో హామీని అదాని, అంబానిలకు చెందిన మీడియా సంస్థలను లైసెన్సులను రద్దు చేస్తాం, గోదీ మీడియా యాంకర్ల రహస్య బ్యాంకు అకౌంట్లపైదర్యాప్తు జరిపిస్తాం, పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యే, ఎంపీలను 20 ఏళ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిషేధిస్తామన్న హామీలిచ్చారు.

ఇలా వెరైటీ పార్టీ పెట్టిన అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో సీజేపీ గురించి ప్రకటించగానే అనూహ్య స్పందన వచ్చిందని చెబుతున్నారు. కేవలం 48 గంటల్లో 40 వేల మంది సభ్యులుగా చేరారు. ఇందులో పలువురు ప్రముఖులు కూడా ఉండటం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. లోక్ సభలో అధికార పక్షంపై విమర్శల నిప్పులు కురిపించే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తన అర్హతల గురించి ప్రస్తావిస్తూ ‘నాకు యాంటీ నేషనల్ పార్టీ’ సభ్యత్వం ఉంది. మీతో కలిసి పనిచేయవచ్చా? అంటూ ప్రశ్నించారు. లోక్ సభలో వాగ్దాటితో విరుచుకుపడే ఎంపీ మహువా మొయిత్రాను ‘యాంటీ నేషనల్ పార్టీ’ అంటూ బీజేపీ విమర్శిస్తుంటుంది. దీనినే ఆమె వ్యంగ్యంగా పేర్కొనగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్న మీకు స్వాగతం అంటూ సమాధానం వచ్చింది.

ఇక మరో ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ సైతం సీజేపీలో చేరడానికి అర్హతలు తెలియజేయాల్సిందిగా కోరారు. 1983 క్రికెట్ వరల్డ్ కప్ గెల్చుకోవడానికి మించిన అర్హత ఏముంది? అంటూ సీజేపీ నుంచి ఆహ్వానం అందింది. కాగా, సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ సీజేపీ అజెండాకు కొన్ని అదనపు అంశాలను జోడించాలని ‘ఎక్స్’ వేదికగా సూచించారు. సమాచార హక్కు చట్టం కింద ప్రజలకు పార్టీ జవాబుదారీగా ఉండాలి. ఎలక్టోరల్ బాండ్స్ తో సహా అజ్ఞాత విరాళాలను స్వీకరించరాదు. ఏనాటికీ కూడా రహస్య కాక్రోచ్ కేర్స్ ఫండ్ ను ప్రారంభించవద్దు అంటూ పలు సూచనలు చేశారు. పీఎం కేర్స్ ను దృష్టిలో పెట్టుకునే ఆమె వ్యంగ్యంగా అలా వ్యాఖ్యానించారని అంటున్నారు. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ నిజమైన రాజకీయ శక్తిగా మారుతుందో లేదో కానీ, ఆన్ లైన్ లో మాత్రం పెద్ద దుమారమే రేపుతోందని చెబుతున్నారు. పార్టీని సోషల్ మీడియాలో విస్తృత ఆదరణ లభించడంతో త్వరలో భారీగా ఆన్ లైన్ సదస్సు నిర్వహిస్తామని అభిజీత్ దీప్కే ప్రకటించారు.

Tags:    

Similar News