ఎన్నికల్లో పోటీకి బొద్దింకల పార్టీ సిద్ధం !
బొద్దింక అని ఎందుకు ఈసడించుకుంటారు అని అంటూ ఏకంగా బెంబేలెత్తేలా చేసింది కాక్రోచ్ జనతా పార్టీ.
బొద్దింక అని ఎందుకు ఈసడించుకుంటారు అని అంటూ ఏకంగా బెంబేలెత్తేలా చేసింది కాక్రోచ్ జనతా పార్టీ. సీజేపీ ఇపుడు దేశంలో మారు మోగుతున్న నినాదం. ఇది ఒక డిజిటల్ విప్లవం. మే 16 నుంచి వారం రోజులలో సీజేపీ దేశ మూలాలను కుదిపేస్తోంది. ఇది యువత ఆవేశం అంటున్నారు. అసహనం అంటున్నారు. పాలకుల తీరు సంప్రదాయ రాజకీయ పార్టీల హోరుని సహించేది లేదని చేస్తున్న హెచ్చరిక అంటున్నారు. వ్యవస్థలు నిర్లక్ష్య పూరితంగా ఉదాశీనంగా ఉంటూ తమ బంగారు భవిష్యత్తుని ఫణంగా పెడుతున్నాయన్న ఆక్రోశం నుంచి పుట్టుకుని వచ్చిందే బొద్దింకల పార్టీ.
లైట్ తీసుకోవద్దు :
కాక్రోచ్ కదా ని తూచ్ అనుకున్నా తేలికగా తీసుకున్నా కూడా సీన్ సితార్ అవుతుందని లక్షల్లో ఫాలోవర్స్ ని గత వారంలో సాధించిన సీజేపీ తెలియచేస్తోంది. దేశం నిండా నిరుద్యోగం, వారి మది నిండా తీరని వెతలు, ఎంతో కష్టపడి చదివితే మరెంతో శ్రమకోర్చి పరీక్షలు రాస్తే లీకుల పేరుతో ఏకంగా రద్దు చేస్తున్నారు. కాలాన్ని కొలుస్తూ కోచింగ్ సెంటర్లకు జీవితాన్ని అప్పగిస్తూ తమ బతుకులకు అను దినం తామే పందెం కట్టుకుంటూ సాగుతున్న సగటి జెన్ జీ తరం సంధించిన పాశుపతాస్త్రమే బొద్దింకల పార్టీ అంటున్నారు.
గ్రౌండ్ లోకి దుగుతుందా :
డిజిటల్ ఫ్లాట్ ఫారం మీద ఆవేశం ఇది గ్రౌండ్ లో ఏముంది అంతా మదే అని సంప్రదాయ పార్టీలు అనుకుంటే పొరపాటు. డిజిటల్ అన్నది ఒక వేదిక మాత్రమే. చేరాల్సిన సందేశం కోటాల్ది యువతకు చేరింది. దేశంలో అరవై నుంచి డెబ్బై కోట్ల మంది యువత ఉన్నారు. అందులో జెన్ జీ తరం సగానికి పైగా ఉన్నారు. వారికి బొద్దింకల పార్టీ ఫిలాసఫీ అర్ధం అయింది. అంటే వారి మెదళ్ళు ప్రస్తుత రాజకీయం తలెగరేస్తూ తిరుగుబాటు చేస్తున్నాయన్న మాట. మరి అది గ్రౌండ్ లో వర్కౌట్ అవుతుందా అంటే ఎందుకు కాదూ అన్న వాదన కూడా వినిపిస్తోంది. ముందు జనాల బుర్రల్లోకి మెసేజ్ పంపించడమే చాలా కష్టం. పూర్వ కాలంలో అయితే గోడల మీద రాత్రలు చేతులల్లో కర పత్రాలు జెండాలు పెట్టి తమ సిద్ధాంతాలకు వివరించడానికి నానా తంటాలు పడే వారు కానీ జెన్ జీ తరం తెలివైనది. అందుకే పైసా ఖర్చు లేకుండానే ఫిలాసఫీ అంతా ఎక్కించేశారు. ఇక దాన్ని ఒంటబట్టించుకున్న వారు కార్యక్షేత్రంలో దూకడమే తరువాత అని అంటున్నారు.
ఎన్నికల్లో పోటీకి :
ఇదిలా ఉంటే ఎక్కడో అమెరికాలో ఒక కుర్రాడు పెట్టిన పార్టీకి అది కూడా సోషల్ మీడియాలో ఉన్న దానికి దడిసిపోవాలా అంటే కచ్చితంగా అని జవాబు వస్తోంది. ఎందుకంటే సీజేపీకి శాఖోపశాఖలు ఇపుడు దేశం నిండా వివిధ అకౌంట్లలో వివిధ రూపాలలో కుప్పలు తెప్పలుగా పుట్టుకుని వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ మహారాష్ట్రలలో రీజనల్ వాట్సప్ గ్రూపులు వెల్లువలా పుట్టుకుని వచ్చాయి. అంటే భావజాలం మరింతగా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళిపోతోంది అన్న మాట. ఇక సీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా యువత రెడీ అవుతోంది. బీహార్ లో తొందరలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటాలను అనుకుంటోంది అని ప్రచారం సాగుతోంది. ఆ మీదట యూపీ ఉత్తరాఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఏడాది ఉన్నాయి. ఆ తరువాత మధ్య ప్రదేశ్ రాజస్థాన్ వంటివి ఉన్నాయి. దాంతో సీజేపీ ఏమి చేయబోతోంది అన్నది ఆసక్తికరంగా ఉంది. చూడాలి మరి ఈ డిజిటల్ విప్లవం గ్రౌండ్ లెవెల్ లో ఏ రకంగా ఊపు తెస్తుంది ఏ విధంగా జోరు చేసి గేరు మార్చి దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని చేంజ్ చేస్తుంది అన్నది.