మీడియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్.. సిల్లీ రీజన్, వైరల్ కంటెంట్!
సీఎం ను ఎలా పిలవాలి అన్న అంశంపై మీడియా, డిప్యూటీ స్పీకర్ మధ్య ఆసక్తికర సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.
సీఎం ను ఎలా పిలవాలి అన్న అంశంపై మీడియా, డిప్యూటీ స్పీకర్ మధ్య ఆసక్తికర సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. సీఎంను పిలిచే విషయంలో ఎవరు ఎలా వ్యవహరించాలన్న అంశంపై సాగిన ఆ సంభాషణ అందరికీ నవ్వు తెప్పిస్తోంది. తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో తాజా మార్పును ప్రతిబింబిస్తోందని అంటున్నారు. ముఖ్యమంత్రి విజయ్ ని రాజకీయ నాయకుడిగా కాకుండా ఇంకా సినీ స్టార్ గా, ఓ ఇంటి అబ్బాయ్ లా చూడటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారని ఈ సంభాషణ ద్వారా అర్థమవుతోందని విశ్లేషిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ బాధ్యతలు స్వీకరించి దాదాపు 20 రోజులు అవుతోంది. గత నెల 10న ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఇన్ని రోజులు రాజధాని చెన్నైలో ముఖ్యమంత్రి కార్యాలయానికి మాత్రమే పరిమితమైన విజయ్ తొలిసారిగా క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. సోమవారం తిరుచ్చి నగరంలో నిర్వహించనున్న బహిరంగ సభకు విజయ్ హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన సీఎం విజయ్.. తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గ వాసులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు సోమవారం సీఎం పర్యటిస్తున్నారు.
ఇక ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ తోపాటు టీవీకే నేతలు ఒక రోజు ముందు తిరుచ్చిలో పర్యటించారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించగా, ముఖ్యమంత్రి విజయ్ విషయంలో మీడియా ప్రతినిధులు, డిప్యూటీ స్పీకర్ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. తిరుచ్చి ఈస్ట్‌లో మిమ్మల్ని పోటీకి నిలబెట్టాలని 'విజయ్' ఆలోచిస్తున్నారా?" అని డిప్యూటీ స్పీకర్ ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ఆయన ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.
‘‘ప్రోటోకాల్ ప్రకారం మీరు ఆయన్ను 'విజయ్' అని పిలవకూడదు. ముఖ్యమంత్రి లేదా 'సీఎం' అని మాత్రమే సంబోధించాలి’’ అని హితబోధ చేశారు. అంతేకాదు, "మేము (పార్టీ వాళ్లం) కావాలంటే ఆయన్ను విజయ్ అనవచ్చు, కానీ మీడియా వాళ్లుగా మీరు అనకూడదు" అని రూల్స్ గుర్తుచేశారు. ఇలా డిప్యూటీ స్పీకర్ క్లాస్ పీకగానే మీడియా ప్రతినిధులు కూడా అస్సలు తగ్గలేదు. సమయస్ఫూర్తితో వెంటనే ఎదురు పంచ్ వేశారు. సార్.. మీరు రివర్స్ చెప్పారు. మేము ఆయన్ను ఎప్పుడైనా ‘విజయ్’ అనే పిలుస్తాం. మీరేమో ఆయన ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు కాబట్టి, ప్రోటోకాల్ ప్రకారం మీరే ఆయన్ను 'సీఎం' అనాలి కానీ మేము కాదు!" అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ మాట వినగానే అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. డిప్యూటీ స్పీకర్ కూడా ఆ సమాధానానికి ముసిముసి నవ్వులు నవ్వుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఈ విలేకరులు, డిప్యూటీ స్పీకర్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో తమిళనాడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. తమిళనాడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై భిన్నమైన చర్చ నడుస్తున్నప్పటికీ, నెటిజన్లు మాత్రం చాలా సరదాగా స్పందిస్తున్నారు.