బట్టలిప్పి కొడితే తప్ప అర్ధం కాదు: రేవంత్ ఆన్ ఫైరింగ్

ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీలోని విభేదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "నాలుగైదుగురు గ్రూపులై కడితే ఎవరికీ భయమేమీ ఉండదు.;

Update: 2025-07-04 16:06 GMT
బట్టలిప్పి కొడితే తప్ప  అర్ధం కాదు: రేవంత్ ఆన్ ఫైరింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ పేరును సంక్షేమ పథకాలకు వాడినందుకు నిరసనలు తెలిపిన వారిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. "బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం అర్థం కాదేమో" అంటూ తీవ్రంగా స్పందించారు.

సంక్షేమ పథకాలకు ఇందిరమ్మ పేరు వాడటాన్ని వ్యతిరేకించిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరా గాంధీ పాలనలో వచ్చిన సీలింగ్ చట్టం, దొరల భూములను పేదలకు పంచడం, ఇళ్లు లేని వారికి గృహాలను అందించడం వంటి కార్యక్రమాలను ఆయన గుర్తు చేశారు. "ఆమె తెచ్చిన సంక్షేమమే ఈరోజు పేదల ఇళ్లలో వెలుగులు నింపుతోంది" అని అన్నారు. ఇందిరా గాంధీ సేవలను మరవలేనివని, ఆమె గొప్పతనాన్ని అర్థం చేసుకోని వారికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనని పరోక్షంగా హెచ్చరించారు.

తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ పాలనే : సీఎం రేవంత్ ధీమా

రాబోయే పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు గ్రామాలకు వెళ్లి ప్రజల మధ్య పనిచేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారికి వివరించాలని సూచించారు. 2029 ఎన్నికలు కొత్త నాయకత్వానికి వేదిక కావాలని, అందులో భాగస్వాములవ్వాలంటే ఇప్పటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పదవులను చిన్నవిగా చూడవద్దని, అవే గుర్తింపు, గౌరవం కలిగిస్తాయని అన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలి ఎన్నికలు వంటివి రాబోతున్నాయని, వాటికి తగ్గట్టుగా ముందుగానే సన్నాహాలు ప్రారంభించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

పార్టీలో ఐక్యతే శక్తి.. ఖర్గే హెచ్చరికలు

ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీలోని విభేదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "నాలుగైదుగురు గ్రూపులై కడితే ఎవరికీ భయమేమీ ఉండదు. పార్టీ నియమాలు ఉల్లంఘించినవారిని క్రమశిక్షణా కమిటీ చూస్తుంది" అంటూ హెచ్చరించినట్లు సమాచారం. పార్టీలో ఐక్యత లేకపోతే నష్టపోతామని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు.

సామాజిక న్యాయం.. కాంగ్రెస్ ధ్యేయం

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సామాజిక న్యాయం కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. కొత్తగా నియమితులైన నాయకులకు పార్టీ చక్కని అవకాశం కల్పించిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.

రోశయ్య విగ్రహావిష్కరణ

ఈ సమావేశం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని లక్డికాపూల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర పీసీసీ నేతలు పాల్గొన్నారు.

ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలంగా, సమన్వయంతో ముందుకు వెళ్లే సంకేతాలు పంపినట్లు స్పష్టమవుతోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా నేతలంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News