ఎంపీ సీఎం రమేషూ... జోరు తగ్గించాలి మీరు..!
రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంటు స్థానాలు ఉంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎంపీల దూకుడు ఒక రేంజ్ లో కనిపిస్తోంది.;
రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంటు స్థానాలు ఉంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎంపీల దూకుడు ఒక రేంజ్ లో కనిపిస్తోంది. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ముందుకు సాగుతున్నారు. ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఎంపీల ఆదిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో టిడిపి ఆధిపత్యమే ఉందని పరిశీలకులు చెబుతున్నప్పటికీ మరోవైపు బిజెపి తరఫున గెలిచిన ఎంపీల ఆదిపత్యం కూడా ఎక్కువగానే ఉందని చర్చ అయితే నడుస్తుంది. ప్రధానంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బిజెపి తరఫున విజయం సాధించిన పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ భారీ దూకుడుతో ముందుకు సాగుతున్నారు అనేది రాజకీయ వర్గాల్లోనే కాదు విశ్లేషకులు కూడా చెబుతున్న మాట.
సాధారణంగా ఎంపీ తన నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కలుపుకుని ముందుకు సాగాలి. లేకపోతే వారిని సంప్రదించి స్థానికంగా జరిగే పనులను తెలుసుకొని వాటి ప్రకారం ముందుకు వెళ్లాలి. దీనికి భిన్నంగా సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారని స్థానికంగా వినిపిస్తున్న మాట. నిజానికి బిజెపి.. టిడిపి కూటమిగా ఉన్న లేకపోయినా గతంలో టిడిపి నాయకుడే అయినప్పటికీ సీఎం రమేష్ ఇప్పుడు తనకు నచ్చిన విధంగా రాజకీయాలు చేస్తున్నారన్న టాక్ ఎక్కువగా నడుస్తోంది. స్థానికంగా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవడం తన సొంత అజెండాను ఆయన అమలు చేయడం ప్రధానంగా ఎంపీ లాడ్స్‌ను ఎవరికి కేటాయిస్తున్నారు? వంటి విషయాలపై చర్చ సాగుతోంది.
అనకాపల్లి నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి తీర ప్రాంత గ్రామాల ప్రజల సమస్యలు, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఓవర్ బ్రిడ్జిలు గత ఎన్నికల సమయంలో ప్రధానంగా ప్రచారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చి ఆయన గెలిచి ఏడాది అయినప్పటికీ ఆయా సమస్యల మీద ఇప్పటికీ దృష్టి పెట్టకపోవడం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను దూరంగా ఉంచి ఆయన వ్యవహరిస్తున్న తీరు వంటివి నియోజకవర్గంలో విమర్శలకు తావిస్తోంది. దీంతో అక్కడ ఎమ్మెల్యేల కంటే కూడా ఎంపీ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు అనే టాక్ అయితే జోరుగా సాగుతుండడం గమనార్హం.
ఇది భవిష్యత్తుకు కానీ, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ చర్చకు గాని కూడా మంచిది కాదనేది పరిశీలకుల మాట. ప్రజలతో కలివిడిగా ఉండటం ముఖ్యంగా కూటమి పార్టీలతో అనుసంధానం ఏర్పాటు చేసుకుని ముందుకు సాగడం వంటివి సీఎం రమేష్ కు మేలు చేస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.